పాత సచివాలయ భవనం కూల్చివేస్తున్న తరుణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలను ట్రాఫిక్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై నుంచి రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. లక్డీకాపూల్, రవీంద్ర భారతి, హిమాయత్‌నగర్ కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి సచివాలయం వైపు వెళ్లే దారులను మూసివేశారు. రెండు రోజులుగా వాహనాలను దారి మళ్లిస్తున్న ట్రాఫిక్ పోలీసులు... ఈ రోజు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాలు దారి మళ్లింపునకు సంబంధించి ముందు రోజే ప్రకటిస్తారు. కానీ సచివాలయ భవనాలకు సంబంధించిన కూల్చివేత పనులు గోప్యంగా ప్రారంభించడం వల్ల.. వాహనాల దారి మళ్లింపు సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని ట్రాఫిక్ పోలీసులు వెలువరించలేదు. ఒక్కసారిగా వాహనాల దారి మళ్లించడం వల్ల వాహనదారులు మొదటి రోజు ఇబ్బంది ఎదుర్కొన్నారు. తర్వాత ట్రాఫిక్ పోలీసులు కొన్నిచోట్ల బారికేడ్లను తొలగించి వాహనాలకు అనుమతించారు.
ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారుల ఇక్కట్లు
నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్న లక్డీకాపూల్ సర్కిల్ ప్రధాన మార్గం కావడం వల్ల అక్కడ వాహనాలు భారీ స్థాయిలో స్తంభించిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, లిబర్టీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చూడండి: నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు