కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్- ఐసీఎంఆర్ సంయుక్తంగా చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌కు తొలి అడుగు పడింది. ఇందులో భాగంగా నిమ్స్‌లో ఆరుగురి వాలంటీర్ల నుంచి మంగళవారం రక్త నమూనాలు సేకరించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ప్రయోగాలు చేశారు. మనుషులపై దీన్ని ప్రయోగించేందుకు ఇటీవల ఆమోదం లభించింది. క్లినికల్ ట్రయల్స్‌కు దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా.. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు అవకాశం లభించింది.
ఆరుగురి రక్త నమూనాలు సేకరణ
కొద్దిరోజులుగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారి కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసీయూ వార్డు సిద్ధం చేశారు. మంగళవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఆరుగురు వాలంటీర్ల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని దిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)కి పంపారు. అక్కడ పరీక్ష కేంద్రంలో ఈ నమూనాలను పరిశీలించి నిమ్స్‌కు నివేదిక పంపుతారు. వారిలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిపై తొలుత ఒక డోసు వ్యాక్సిన్ ప్రయోగిస్తారు.
14 రోజుల పాటు పర్యవేక్షణ
రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వారి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించాక వాలంటీర్లను ఇళ్లకు పంపుతారు. 14 రోజులపాటు వారిని నిమ్స్ వైద్యులు ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంలో వస్తున్న మార్పులను నమోదు చేసుకుంటారు. దీనికోసం మొదటిదశలో ఆరుగురి నమూనాలను పంపినట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో క్లినికల్ ట్రయల్స్‌కు అవసరమైన వ్యాక్సిన్ రానుందని వెల్లడించారు. ఇక్కడ నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కోసం 60 మంది వాలంటీర్లు అవసరమవుతారని వైద్యులు అంచనా వేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని వైద్యుల బృందం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ