లాక్‌డౌన్ నేపథ్యంలో భాగ్యనగర పరిధిలోని వలస కూలీలు, యాచకులను ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చినా అధికారులు క్షేత్రస్థాయిలో సరైన ఏర్పాట్లు చేయక వేలాది మంది రోడ్డున పడ్డారు. బల్దియా అధికారులు దాదాపు 4వేల మందికి పైగా వలస కూలీలు, యాచకులను నిరాశ్రయుల వసతి గృహాలకు తరలించారు.
అధికారికంగా నిర్వహిస్తున్న 12 వసతి గృహాలతో పాటు తాత్కాలికంగా మరో 13 కేంద్రాలు, పలు స్వచ్ఛంద సంస్థల సాయంతో మరో 80 దాకా వీటిని ఏర్పాటుచేశారు. చేరదీసిన వారికంటే రెట్టింపు నిరాశ్రయులు బయటే ఉన్నారని స్పష్టమవుతోంది. బల్దియా నిర్వహిస్తున్న 25 కేంద్రాల్లో ఒక్కో దానిలో వందకు పైగా ఆశ్రయం పొందుతుండగా.. వారంతా చాలాకాలంగా ఇక్కడ ఉంటున్నవారే. లాక్‌డౌన్‌తో ఇక్కట్లు పడుతున్నవారిని పెద్దసంఖ్యలో చేరదీస్తే వారిక్కడ ఉండలేక తిరిగి రోడ్ల మీదకే చేరుకున్నారు.
మెట్రో కేంద్రాలే ఆవాసం..
షెల్టర్‌హోంలన్నీ నిండిపోవడం వల్ల రోడ్డెక్కిన నిరాశ్రయులు మెట్రో కేంద్రాల్లోనే ఉంటున్నారు. దాతలిచ్చే ఆహారంతోనే రోజులు వెళ్లదీస్తున్నారు. ఆహార పంపిణీపై అధికారులు ఆంక్షలు విధించడం వల్ల వీరికి తిప్పలు తప్పట్లేదు.
ఎక్కడెక్కడ ఎంతమంది..?
- బేగంపేట మెట్రో కేంద్రం నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ కేంద్రం వరకు దాదాపు 200 మంది కాలిబాటపైనే ఉంటున్నారు.
- సికింద్రాబాద్ ఆర్పీరోడ్‌లో 50 మంది రోడ్లపక్కనే కనిపిస్తున్నారు.
- పంజాగుట్ట మెట్రో కేంద్రం నుంచి నాంపల్లి మెట్రో కేంద్రం వరకు కాలిబాటలపై దాదాపు వంద మంది ఉంటున్నారు.
- సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లో 100 మంది ఉన్నారు.