పబ్, బార్, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ల యజమానులు బాధ్యతాయుతంగా మెలగాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల కాలంలో శబ్ద కాలుష్యం, పార్కింగ్ సమస్యల నేపథ్యంలో.. మద్యం మత్తులో ఆయా పబ్, బార్‌ల నుంచి బయటకు వచ్చిన వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు స్థానికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయని సీపీ తెలిపారు. ఇటువంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ తరహా కార్యకలాపాలు నగరానికి మచ్చగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
నగర ప్రఖ్యాతిని మసకబారే విధంగా నడుచుకోవద్దని సీపీ హెచ్చరించారు. చట్టానికి లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని... ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం నేపథ్యంలో కమిషనర్ సీవీ ఆనంద్ నగరంలోని పబ్, బార్, డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీ రమేష్‌తో పాటు అన్ని మండలాల డీసీపీలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: