Service Charge in Hotel : హోటళ్లలో భోజనం చేస్తే సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీతో పాటు ఇతర టాక్స్‌లు చెల్లించాల్సి వస్తోంది. సర్వీస్ ఛార్జీలు వినియోగదారు ఇష్టంపైనే చెల్లించాలని ఉన్నా కొన్ని రెస్టారెంట్లు ఈ విషయం దాచిపెట్టి అందరివద్దా ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 సైతం ఓ హోటల్‌వారిని మందలించింది.
ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన న్యాయవాది కె.రాజశేఖర్ స్నేహితులతో కలిసి 2021 ఆగస్టులో జూబ్లీహిల్స్‌లోని ‘అంతెరా కిచెన్ అండ్ బార్’లో భోజనానికి వెళ్లారు. బిల్లు రూ.3,543 అయ్యింది. సర్వీస్‌ఛార్జీ 5శాతం వసూలు చేయడంపై అక్కడి సిబ్బందిని పిలిచి ఆ కాలమ్‌ను తొలగించాలన్నారు. ఒప్పుకోని మేనేజర్.. తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఫిర్యాదీ బిల్లు చెల్లించాల్సి వచ్చింది.
అనంతరం రాజశేఖర్ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ప్రతివాద సంస్థ సీజీఎస్టీ 2.5శాతం, ఎస్‌జీఎస్టీ 2.5శాతం, సర్వీస్ ఛార్జీ 5శాతం వసూలుచేసినట్లు కమిషన్ గుర్తించింది. అనైతిక వ్యాపారమని వ్యాఖ్యానిస్తూ.. బిల్లుపై సర్వీస్‌ఛార్జీ కాలమ్‌ను ఖాళీగా ఉంచాలని, రాజశేఖర్‌కు రూ.164.95, పరిహారం రూ.2వేలు, కేసు ఖర్చులు రూ.1,000 45రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 బెంచ్ అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు కె.రామ్‌మోహన్, సి.లక్ష్మి ప్రసన్నతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది.
ఇవీ చదవండి :