హైదరాబాద్ సిటీ సెక్యురిటీ కౌన్సిల్ దక్షిణ మండల ఓరియెంటేషన్ కార్యక్రమం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ సెక్యురిటీ కౌన్సిల్, సిటీ పోలీస్ సంయుక్తంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హాజరయ్యారు.
సంస్థ పని తీరు, ఆవశక్యత, ఉద్దేశం, 6 నెలల నుంచి సమాజ శ్రేయస్సు కోసం చేసిన పనులను ఈ సమావేశంలో వివరించారు. సమావేశానికి హాజరైన పలువురు వ్యాపారులు తమ వంతుగా చెక్కుల రూపంలో సంస్థకు ఆర్థిక సహాయాన్ని అందించారు. కరోనా రోగులకు ప్లాస్మా దానం చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించి వారికి ధ్రువ పత్రాలు అందజేశారు.
సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తత, ప్లాస్మా దానం, ఆపద సమయాల్లో ఆదుకోవడం, సేవా కార్యక్రమాలు, మహిళా భద్రత, సాధికారత, నేరాల తగ్గింపు లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుందని సీపీ పేర్కొన్నారు. వీరితో పాటు కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి, హెచ్సీఎస్సీ అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్, సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్, అదనపు డీసీపీ ఎం.ఎ రఫిక్, దక్షిణ మండల ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రేపు నారాయణపేటకు వెళ్లనున్న బండి సంజయ్