హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారుల అలక్ష్యం హుస్సేన్‌సాగర్ పాలిట శాపంగా మారింది. ప్రక్షాళన పేరిట వెచ్చించిన రూ.వందల కోట్లు బూడిదలో పోసినట్లయిందని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) నియమించిన ప్రత్యేక కమిటీ తేల్చి చెప్పింది. గత నెల 15, 16 తేదీల్లో నలుగురు సభ్యులతో కూడిన బృందం పర్యటించి నివేదికను ఎన్జీటీకి సమర్పించింది.
నలుగురు సభ్యులతో..
హుస్సేన్‌సాగర్ కాలుష్యంపై సామాజిక కార్యకర్త డా.లుబ్నా సారస్వత్ ఎన్జీటీని ఆశ్రయించారు. ధర్మాసనం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది మార్చి 16, 17 తేదీల్లో సభ్యులు పర్యటించి నివేదికను సమర్పించారు. దీనిపైౖ పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఎన్జీటీ నలుగురు సభ్యులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ శాస్త్రవేత్త డా.వైఆర్‌ఎస్ రావు, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డా.శశిధర్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ(చెన్నై ప్రాంతీయ కార్యాలయం) శాస్త్రవేత్త డా.ఎంటీ కరుప్పయ్య, సీపీసీబీ(చెన్నై ప్రాంతీయ కార్యాలయం) శాస్త్రవేత్త పూర్ణిమ ఇందులో ఉన్నారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పిటిషనర్ అభ్యంతరాలు, ఎస్టీపీల నిర్వహణ, నీటి నాణ్యతపై అధ్యయనం చేయాలని సూచించింది. బయో రెమీడేషన్‌తోనే హుస్సేన్‌సాగర్ పరిరక్షణ సాధ్యం కాదని చెప్పింది. ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలు, మురుగు కలవకుండా చేస్తేనే ఫలితముంటుందని స్పష్టం చేసింది.
ఏం తేలింది..
కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చే వ్యర్థాలను సాగర్‌లో కలవకుండా మూసీకి మళ్లించేలా జలమండలి రూ.50 కోట్లతో పైపులైన్ పనులు చేపట్టింది. పైపులైన్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో యథావిధిగా వ్యర్థాలు కలిశాయి. హెచ్‌ఎండీఏ అక్కడ ఐఅండ్‌డీ(ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్)ను నిర్మించింది. అదీ ఫలితమివ్వడం లేదు. ప్రవాహం పెరిగినప్పుడు 30- 40 శాతం వ్యర్థాలు సాగర్‌లో కలుస్తున్నట్లు గుర్తించారు.
* బల్కాపూర్ నాలాపై ఎస్టీపీ పనిచేయక మురుగును మూసీలోకి కలిపేస్తున్నారు.
* పికెట్ నాలాపై 30 ఎంఎల్‌డీ ఎస్టీపీని నిర్మించారు. ఇందులో శుద్ధి చేయకుండానే కొంత మురుగు సాగర్‌లో కలుస్తోంది.
* అసలు హుస్సేన్‌సాగర్‌లో ఎంత మురుగు కలుస్తుంది..? కూకట్‌పల్లి, బుల్కాపూర్, పికెట్, బంజారా నాలాల్లో ఎంత మురుగు వస్తుంది..? అనే లెక్కలు లేవు. మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించినా.. అడుగులు పడలేదు.
- ఇదీ చూడండి : ఇంటింటికీ ఇంటర్నెట్: మంత్రి కేటీఆర్