Teachers Transfer in Telangana : రాష్ట్రంలోని అర్బన్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలకు మించి భార్యాభర్తల విభాగం(స్పౌస్) దరఖాస్తులు అందాయి. వారిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తలల పట్టుకుంటున్నారు. ఈసారి కేటాయింపు ప్రక్రియ అంతా సాధారణ పరిపాలనాశాఖ చేపట్టడంతో విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఉపాధ్యాయులకు తమకు ఏమీ తెలియదని.. సమాచారం లేదని సమాధానమిస్తున్నారు.
మొత్తం భర్తీ చేస్తే.. కొత్త నియామకాలుండవు..
Applications for Teachers Transfer : రాష్ట్రవ్యాప్తంగా భార్యాభర్తల దరఖాస్తుల సంఖ్య దాదాపు 5 వేల వరకు అందాయి. వాటిల్లో అత్యధికంగా అర్బన్ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి వాటికి అధికంగా వచ్చాయి. మేడ్చల్ జిల్లాలో 200 ఖాళీలు ఉండగా సుమారు 450 వరకు, రంగారెడ్డి జిల్లాలో 500 ఖాళీలకు దాదాపు 600 దరఖాస్తులు అందాయి. వరంగల్, హనుమకొండలో కూడా ఖాళీలకు మించి పోటీపడుతున్నారు. ఒకవేళ మొత్తం ఖాళీలను భర్తీ చేస్తే కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు ఉండవు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో 33 శాతం ప్రత్యక్ష నియామకాలు(డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఉంచి మిగిలిన వాటిని భర్తీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారుల్లో సీనియారిటీ ఆధారంగా భర్తీ చేస్తారని, మిగిలిన వారిని భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడిన తర్వాత అవకాశం ఇచ్చే అవకాశం ఉందని, వాటిపై మార్గదర్శకాలు రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. 70 శాతం ఖాళీలను భర్తీ చేస్తే ఆ జిల్లాలోని ఉపాధ్యాయులకు పదోన్నతుల దారి మూసుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు.
సరిదిద్దకుండా ఎలా?
Telangana Teachers Transfer Issue : ఉత్తర్వులు, నిబంధనలు పట్టించుకోకుండా మహబూబ్‌నగర్ జిల్లాలో రూపొందించిన సీనియారిటీ జాబితా తప్పులతడకగా మారింది. హిందీ, తెలుగు పండితుల జాబితాలో జూనియర్లను సీనియర్లుగా, సీనియర్లను జూనియర్లుగా మార్చారు. రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగంలో చేరిన తేదీని(జాయినింగ్ డేట్) పరిగణనలోకి తీసుకోగా...పాలమూరులో మాత్రం డీఎస్‌సీ 2002 తేదీ ఆధారంగా సీనియారిటీ నిర్ణయించారు. వాస్తవానికి ఆ డీఎస్‌సీకి చెందిన దాదాపు 72 మంది న్యాయస్థానం తీర్పు ఆధారంగా 2006, 2008, 2009లో ఉద్యోగంలో చేరారు. దాంతో 2002, 2003, 2006 డీఎస్‌సీ ద్వారా ఎంపికైన 220 మంది భాషా పండితులు నష్టపోయారు. ఇది రాష్ట్ర అధికారుల దృష్టికి వచ్చింది. వాటిని పరిష్కరించకుండా ముందుకు వెళితే న్యాయపరంగా కేసులు ఎదురవుతాయని భావిస్తున్నారు. వారి అప్పీళ్లను సమగ్రంగా పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ డిమాండ్ చేశారు. జిల్లాలో సీనియారిటీ జాబితాల్లో అవకతవకలు జరిగాయని ఇటీవల బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మహబూబ్‌నగర్‌లో నిరాహార దీక్ష చేశారు. అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే పాఠశాలలకు పోస్టింగ్‌లను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అప్పీలు పరిష్కారం ఎప్పుడు ?
Husband and Wife Applications for Teachers Transfer : సీనియారిటీ జాబితాలో తనకు అన్యాయం జరిగిందని.. మెడికల్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేదని.. ఉద్యోగంలో చేరిన జాబితాను కాకుండా డీఎస్‌సీని పరిగణనలోకి తీసుకొని సీనియారిటీని నిర్ణయించారని.. ఎస్‌సీ, ఎస్‌టీ రోస్టర్‌లో తప్పులున్నాయని...ఇలా రాష్ట్రవ్యాప్తంగా 8 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. ఇంకా ప్రతిరోజూ దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఇంకా రెండు వేలు అందొచ్చని అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి తదితర ఉమ్మడి జిల్లాల్లో పెద్ద ఎత్తున తప్పులు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. అంతర్గతంగా అధికారులు కూడా జిల్లా స్థాయిల్లో తప్పులు జరిగినట్లు అంగీకరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం సీనియారిటీ జాబితా తయారీకి కేవలం అయిదారు రోజులే సమయం ఇచ్చారని ఒక డీఈవో ఆవేదన వ్యక్తం చేశారు.