ALLURI SEETHARAMARAJU: ఏపీలోని ఉమ్మడి విశాఖ మన్యంలో చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు దాడి చేసి మన్యం తిరుగుబాటుకు శ్రీకారం చుట్టి ఈ నెల 22కి వందేళ్లు. ఈ నేపథ్యంలో మన్యం తిరుగుబాటు శత జయంత్యుత్సవాలు నిర్వహిస్తాం’ అని క్షత్రియ సేవా సమితి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిబాబు రాజు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 22న చింతపల్లిలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ముండా, ఏపీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, మంత్రులు రోజా, అమరనాథ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశంలో 300 స్వాతంత్య్ర ఉద్యమ ప్రాంతాలను గుర్తించి నాటి పోరాట యోధులకు కేంద్ర ప్రభుత్వం సముచిత గుర్తింపు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఇందులో భాగంగానే గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన అల్లూరికి గుర్తింపు లభించిందన్నారు.
1924 మే 7న అల్లూరిని బ్రిటిష్ సేనలు చుట్టుముట్టిన మంప చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నాటి ఘటనను కళ్లకు కట్టేలా నమూనా విగ్రహాలను, రాజేంద్రపాలెంలో అల్లూరిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపిన ప్రదేశంలో నమూనా స్మారకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 1916లో లంబసింగి ఘాట్ రోడ్డు నిర్మాణానికి గుర్తుగా పెదపేట సమీపంలో ఏర్పాటు చేసిన రాతి స్తూపాన్ని పరిరక్షిస్తామని వెల్లడించారు. సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను పునరుద్ధరించి స్మారకంగా ఉంచుతామన్నారు. పాండ్రంగిలో అల్లూరి జన్మించిన ఇంటిని పరిరక్షిస్తామన్నారు. అల్లూరి చేతిలో హతమైన బ్రిటిష్ గెరిల్లా పోరాట యోధుల సమాధుల ప్రాంతాన్ని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, క్షత్రియ సేవా సమితి తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యుడు రాజాసాగి లక్ష్మీనరసింహరాజు (చంటి), క్షత్రియ పరిషత్తు ప్రతినిధులు రాధాకృష్ణరాజు, శ్రీరామరాజు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: