చెడుపై మంచి విజయానికి సంకేతమే దీపావళి. ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్థానిక ఉత్పత్తులతో పండుగ చేసుకొని స్వదేశీ తయారీదారుల జీవితాల్లో వెలుతురు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దీపావళిని దేశ ప్రజలు జరుపుకుంటారన్నారు. మహోన్నతమైన సంస్కృతిని తెలియజెప్పే దీపావళి పండుగను దేశప్రజలు సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.
విద్యుద్దీప కాంతులతో..
చార్మినార్ వద్ద ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దీపావళి సందడి నెలకొంది. విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. దీపావళి సందర్భంగా (Diwali celebrations 2021) అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని లైట్లతో అలంకరించారు. విద్యుద్దీపకాంతుల్లో సాంస్కృతిక వేదిక వెలిగిపోతోంది.
మార్కెట్లు కళకళ..
దీపావళి వేళ... మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. పూల మార్కెట్లు రద్దీగా దర్శనమిస్తున్నాయి. బంతిపూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. కిలో 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పూలు హైదరాబాద్‌కు రావడంతో ధరలు దిగొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు.
రకరకాల స్వీట్లు..
మిఠాయిల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. రకరకాల స్వీట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పండగ సందర్భంగా సరికొత్త మిఠాయిలను అందుబాటులోకి తెచ్చారు. పండక్కి కొన్ని రోజుల ముందు నుంచే రకరకాల రుచులను సిద్ధం చేసి కొనుగోలుదారులకు అందిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా స్వీట్లను అందుబాటులో ఉంచారు.
ఇదీచూడండి: Diwali Precautions: దీపావళి రోజు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!