రెండేళ్ల క్రితం మహేశ్వరంలో రూ.35 వేల లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కాడు..
గత ఏడాది జులైలో యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ ఏసీబీకి పట్టుబడ్డారు. రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధి నుంచి రూ.20 వేలు తీసుకుంటూ చిక్కారు. అనంతరం సబ్‌రిజిస్ట్రార్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.76 లక్షల నగదును అధికారులు గుర్తించారు..
కిందటి సంవత్సరం అక్టోబరులో రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ రూ.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రద్దు చేయడానికి ఈ మొత్తం డిమాండ్ చేయడం గమనార్హం..
తాజాగా సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సబ్‌రిజిస్ట్రార్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. గిఫ్ట్‌డీడ్ వ్యవహారంలో లంచం తీసుకుంటూ చిక్కాడు..
ఈ క్రమాన్ని గమనిస్తే ఏళ్లు గడుస్తున్నా... ఏసీబీ వలకు చిక్కుతున్నా చాలామంది సబ్‌రిజిస్ట్రార్లలో ఏ మాత్రం జంకూ గొంకూ లేదని తేటతెల్లమవుతోంది. సస్పెండైనా నష్టం లేదులే.. కొన్ని నెలల తర్వాత పోస్టింగ్ అదే వస్తుందనే ధీమాతో లంచాలకు ఏమాత్రం వెరవడం లేదు. ఫలితంగానే ఏసీబీకి పట్టుబడిన వారు మళ్లీ మళ్లీ తప్పులు చేయడానికి వెనుకాడటంలేదు. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తే దానిని వరంగా మలచుకొని మరీ రూ.లక్షలు పోగేస్తున్నారు. అందుకే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగే చోట పోస్టింగ్‌లకు డిమాండ్ భారీగా ఉంటోంది. కాగితాలన్నీ సక్రమంగా ఉన్నా కనీసం రూ. మూడు వేల నుంచి పది వేలు వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్లలో లోపాలు, లింక్ డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, నిషేధిత ఆస్తుల జాబితా వంటి అంశాల నేపథ్యంలో కొందరు సబ్ రిజిస్ట్రార్లు భారీగా దందాలకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్లు భారీగా జరిగే కార్యాలయాల్లో నిత్యం రూ.20 వేల నుంచి రూ.50 వేలు లేనిదే వారు ఇంటికెళ్లే పరిస్థితి లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల తాకిడి అధికం. చాలాచోట్ల దస్తావేజు లేఖరుల సాయంలేనిదే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం అసాధ్యంగా ఉంటోంది.
ఓ సబ్‌రిజిస్ట్రార్ ఒక రోజు రూ.9 లక్షలు పోగేశాడు
ఇటీవల ఒక జిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక రియల్టర్ కోర్టుద్వారా తెచ్చుకున్న ఉత్తర్వులతో ఒకే రోజు వందదాకా రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇందుకు సబ్‌రిజిస్ట్రార్‌కు ముట్టింది అక్షరాల రూ.9 లక్షలు. ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సొమ్ము జేబులో వేసుకొని ఆయన పని పూర్తి చేశాడు. ఈ వ్యవహారం రిజిస్ట్రేషన్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఎవరికెంతో నిర్ణయించేది దస్తావేజు లేఖరులే
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చక్రం తిప్పేది అంతా డాక్యుమెంట్ రైటర్లే. సబ్‌రిజిస్ట్రార్‌కు, సిబ్బందికి.. ఇలా ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలి అనేది వారు నిర్ణయించి పంపకాలు పూర్తి చేస్తున్నారు. ఆస్తి విలువ ఆధారంగా ఖరారు చేస్తారు. దీంతో పాటు డాక్యుమెంట్ రాసినందుకు ఇతర వ్యవహారాలు చూసినందుకు డాక్యుమెంట్ రైటర్‌కి అదనంగా ఇవ్వాల్సిందే. అన్నింటికి టోకుగా నిర్ణయించి వసూలు చేస్తున్నారు.
కలిసొస్తున్న సబ్‌రిజిస్ట్రార్ల కొరత
రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్ల కొరత, సిబ్బంది సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీకి చిక్కినా లేదా ఇతర కారణాలతో సస్పెండైనా అలాంటి సబ్‌రిజిస్ట్రార్లను అదే జిల్లాలో లేదా సస్పెండైన స్థానంలోనే మళ్లీ నియమిస్తుండటంతో చాలాచోట్ల అక్రమాలకు అడ్డూఅదుపూ ఉండటంలేదు.
ఇదీ చదవండి: పార్టీ నుంచి అరెస్టుల దాకా.. జూబ్లీహిల్స్ కేసులో మినిట్ టు మినిట్ అప్డేట్