సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ ప్లాజాలకు భారీ ఆదాయం వచ్చింది. ఎనిమిది రోజుల్లో రాష్ట్రంలోని జాతీయ రహదారుల పరిధిలో రూ.29.85 కోట్ల టోల్ ఫీజు వసూలైంది. గతేడాది సంక్రాంతికి ఇదే సమయంలో రూ. 23.85 కోట్లు వచ్చింది. గడిచిన ఏడాదితో పోల్చితే.. ఈసారి రూ.5.47 కోట్లు అదనంగా టోల్ ఫీజు వసూలైనట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు.
జాతీయ రహదారుల సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని వివిధ టోల్ ప్లాజాల వద్ద 81.59 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా చెల్లించారు. 18.22 శాతం మంది నగదు రూపంలో... 0.19 శాతం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేశారు. సంక్రాంతికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, మహారాష్ట్రాల మధ్య పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. ప్రత్యేకించి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రజలు భారీగా ప్రయాణాలు చేస్తుంటారు. కరోనా నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
రెండు రాష్ట్రాల ఆర్టీసీలు పండగకు ప్రత్యేక బస్సులు నడిపినప్పటికీ... అధిక శాతం మంది వ్యక్తిగత వాహనాల ద్వారానే ప్రయాణం చేశారు. హైదరాబాద్- బెంగళూరు మినహా... రాష్ట్రం నుంచి వెళ్లే ఇతర జాతీయ రహదారుల్లో పండుగ సందర్బంగా వారం రోజుల వ్యవధిలో 20,55,800 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఒక్క హైదరాబాద్- విజయవాడ- హైదరాబాద్ మార్గంలోనే 12,38,942 వాహనాలు రాకపోకలు సాగించాయని అధికారులు వెల్లడించారు.