ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఓట్లు అడగని వ్యక్తికి ఎందుకు వేయాలన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని జోరాష్ట్రీయన్ క్లబ్‌లో భాజపా ఏర్పాటు చేసిన హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో బండి సంజయ్‌తో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు.
ఆకస్మాత్తుగా ప్రేమేందుకు..
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పీఆర్సీని ఏ విధంగా ప్రకటిస్తారని బండి సంజయ్ నిలదీశారు. ఉద్యోగ సంఘాల నాయకులు యాచించొద్దని శాసించాలన్నారు. కొవిడ్ సమయంలో ముఖ్యమంత్రి ఒక్క ఆసుపత్రి సందర్శించలేదని... తమ అభ్యర్థి రాంచందర్ రావు పీపీఈ కిట్స్ ధరించి ఐసోలేషన్ వార్డుకు వెళ్లారన్నారు. పీవీ నరసింహారావు మీద కేసీఆర్‌కు ఆకస్మాత్తుగా ప్రేమేందుకు పుట్టిందో బయటపెడతానని పేర్కొన్నారు.
దొంగ సంతకాలు పెట్టారు
కేసీఆర్ పార్లమెంట్‌కు పోకుండానే పోయినట్లు దొంగ సంతకాలు పెట్టించారని బండి సంజయ్ ఆరోపించారు. సభను తప్పుదోవ పట్టించిన కేసీఆర్‌కు నైతికత ఉంటే రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌కు జీతం ఎందుకివ్వాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఓయూ న్యాక్ గుర్తింపు పోయే దుస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు. జాతీయ భావం ఉన్న భాజపా అభ్యర్థి రాంచందర్‌రావును గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి : ఇతర రాష్ట్రాలకు 'వీ హబ్' ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి కేటీఆర్