- ప్రశ్న: బీరుట్లో జరిగిన విస్ఫోటనానికి అమ్మోనియం నైట్రేటే కారణమని తేలడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి. అమ్మోనియం నైట్రేట్ సహజంగానే పేలుడు పదార్థమా..?
ప్రొ. ప్రసాద్: అమ్మోనియం నైట్రేట్ సహజంగా పేలదు. సరిగ్గా నిల్వ ఉంచితే ప్రమాదమేమి ఉండదు. దానిలో సమస్య ఏంటంటే.. వాతావరణంలోని తేమను తనలోకి పీల్చుకునే గుణం ఉంది. దాని వల్ల అది కేకులాగా మారిపోతుంది. చిన్న చిన్న గోళీల్లాగా ఉండకుండా.. ఇలా కేకులా మారితే ప్రమాదం. ఆ సందర్భంలో దానిపై ఒత్తిడి పెరిగితే అది పేలే అవకాశాలున్నాయి.
- లెబనాన్ కంటే ముందు మరెక్కడైనా దీనివల్ల ప్రమాదాలు జరిగాయా?. అమ్మోనియం నైట్రేట్‌కు ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా?
అన్నింటికన్నా ముఖ్యమైంది.. 1947లో టెక్సాస్‌లో జరిగిన ప్రమాదం. అంతకు రెండేళ్ల ముందు అమెరికా హిరోషిమా మీద వేసిన ఆటంబాంబు అంత అలజడి సృష్టించింది. టెక్సాస్ నుంచి వెయ్యి మైళ్ల దూరంలో కూడా దాని ప్రకంపనలు నమోదు అయ్యాయి. 2013లో చైనాలోని టియాంగ్జిన్లో భారీ ప్రమాదం జరిగింది. ఇది ఎప్పుడూ ప్రమాదకారే. దీనిని నిర్వహించేవారు బాధ్యతాయుతంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు. అమ్మోనియం నైట్రేట్‌ను మనం విస్మరించలేం. ఆహారోత్పత్తిలో దాని అవసరం చాలా ఉంది. ఎరువుగా విరివిగా వినియోగిస్తున్నాం. కొన్ని ప్రాణాలు కాపాడే ఔషధాల తయారీలోనూ వాడుతున్నాం. కాబట్టి దీనిని వాడకుండా ఉండలేం.
- మనం ఎక్కువగా అమ్మోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. దీనిని పెద్ద ఎత్తున నిల్వచేయడం ఎంత వరకు సురక్షితం?
దీనిని నిల్వ చేసే విషయంలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ ఆర్గనైజేషన్ , పీసీబీ వంటి సంస్థలు అక్కడ నిబంధనలు పరిశీస్తుంటాయి. ఆ నిబంధనలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలి. ఈ పర్యవేక్షణ సమర్థవంతంగా ఉంటే ఇబ్బంది ఉండదు.
- విశాఖలో పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్‌కు 700 టన్నుల అమ్మోనియం నైట్రేను తరలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇది ప్రమాదకరం కాదా..?
ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు సహజంగానే అందరిలోనూ ఆందోళన ఉండటం సహజం. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఎందుకు అకస్మాత్తుగా తీసుకువస్తున్నారన్నది ప్రశ్న. చెన్నైలో భద్రతాపరమైన చర్యలు పాటించే పరిస్థితి లేదా..? లేకపోతే.. ఇన్నిరోజులు ఎందుకు ఉంచారు..? ఉంటే.. ఎందుకు తరలిస్తున్నారు.. ? ఇవన్నీ ఆలోచించాలి. ఒకవేళ తప్పు దిద్దుకోవడానికి చేస్తున్నట్లు అయితే.. హైదరాబాద్‌లో సరైన భద్రతా చర్యలు తీసుకుని తరలిస్తే ఇబ్బంది లేదు. విశాఖలో ఎప్పుడూ 20వేల టన్నుల నిల్వ ఉంటుంది. దాదాపు రెండు లక్షల టన్నుల దిగుమతి జరుగుతుంది. ఇక్కడకు వచ్చేదాంట్లో ఎక్కువగా ఫెర్టిలైజర్ గ్రేడ్ ఉంటుంది. రెండో రకం.. ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీని జీవితకాలం ఐదేళ్లు ఉంటుంది. సరైన చర్యలు తీసుకుని ఐదేళ్ల వరకూ నిల్వచేయవచ్చు. బీరుట్లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్‌ను 2015లో తీసుకువచ్చారు అంటున్నారు. అంటే ఐదేళ్లు దాటిపోయింది.. దీనివల్ల డీ కంపోజ్ అయిపోయి ఉంటుంది.
- డీ కంపోజ్ అయిపోతే.. పరిమాణం తగ్గి .. ప్రమాదం తగ్గాలి కదా..?
లేదు. డీ కంపోజ్ అయితే.. ప్రమాద తీవ్రత పెరుగుతుంది. డీ కంపోజ్ అయిన తర్వాత సైక్లోస్కోపిక్ రూపంలోకి మారుతుంది. అప్పుడు ఏ చిన్న ఒత్తిడి తగిలినా పేలుతుంది.
- కేంద్ర ప్రభుత్వం అమ్మోనియం నైట్రేట్ 2012 మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అవి ఏంటి.. వాటిని సక్రమంగా పాటిస్తున్నారా..?
భద్రతా పరంగా ఎలా నిల్వచేయాలి, రవాణా ఎలా జరగాలి అన్న విషయాలు ఈ నిబంధనల్లో ఉన్నాయి. ముఖ్యంగా రవాణా విషయంలో అమ్మోనియం నైట్రేట్ ఎక్కడకు వెళుతుంది?.. ఎవరు తీసుకుంటున్నారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇంతకు ముందు రవాణా సమయంలో అమ్మోనియం నైట్రేట్ ట్రక్కులు దొంగిలించారు. అలాంటి ఘటనకు జరగకుండా.. పంపించే వారు.. తీసుకునే వారి వివరాలు నమోదు చేస్తారు. పెసో వాళ్లు దీనిని పర్యవేక్షిస్తారు. నిల్వ విషయంలో కూడా అగ్నిమాపక సాధనాలు, ఫోమ్ ఉన్నాయా అని పరిశీలిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న అన్ని అంశాలు ఉన్నాయా లేదా చూస్తారు.
- విశాఖ పోర్టు చాలా కీలకం అవుతోంది. ఇక్కడి నుంచే తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, చత్తీస్ గఢ్, ఒడీశాకు రోడ్డు ద్వారా రవాణా అవుతోంది. ఇది పేలుడు పదార్థం కాబట్టి రవాణా సక్రమంగానే జరుగుతుందా..?
ఈ కొత్త నిబంధనలు వచ్చాక రవాణా సక్రమంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. 2012 తర్వాత తస్కరణకు గురైన కేసులు నమోదు కాలేదు. అయితే బీరుట్లో జరిగిన సంఘటనతో సంఘ విద్రోహ శక్తులు ప్రేరేపితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. నియంత్రిత సంస్థలు తరచుగా తనిఖీలు, పర్యవేక్షణలు చేస్తుంటే.. నిల్వచేసే వారిలో బాధ్యత పెరుగుతుంది.
- రవాణా గురించే అసలు సమస్య...7-8 ఏళ్ల క్రితం అమ్మోనియం నైట్రేట్ లారీలు హైజాక్ అయ్యాయి. ఇక్కడి నుంచి వెళ్లే రాష్ట్రాలు అన్నీ కూడా మావోయిస్టు ప్రభావితమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రవాణా చేసేప్పుడు ఎక్కడకు పంపుతున్నారో డిక్లేర్ చేయాలి. అలాగే సరుకును పంపిన దగ్గర నుంచి రసీదు.. నియంత్రిత సంస్థలకు చేరాలి. రెండు చోట్లా తనిఖీలు చేయాలి. ఎక్కడైనా తేడా వస్తే.. కొంత మొత్తం పక్కదారి పట్టిందని గుర్తించాలి. క్రమం తప్పకుండా చేయడం వల్ల పక్కదారి పట్టకుండా చూడొచ్చు. అలాగే నిల్వచేసిన దగ్గర కూడా సెన్సార్లు పెట్టాలి. ఉష్ణోగ్రత పెరిగితే.. వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉండాలి. ఆటోమోడ్ విధానం ఉంటే ప్రమాదాలు కొంతవరకూ తగ్గించవచ్చు. సాధారణ ఉష్ణోగ్రతలు ఏమీ కాదు.. 169 డిగ్రీల దగ్గర మాత్రమే అది కరుగుతుంది. కానీ ఒత్తిడి వస్తే.. మాత్రం అంతకంటే .. తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా పేలే అవకాశం ఉంది.
- విశాఖలో చాలా ఎక్కువ నిల్వలు ఉంటున్నాయి. అక్కడ తేమ వాతావరణం (హ్యుమిడిటీ..) ఎక్కువ.. దీని వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉందా..?
హ్యుమిడిటీ వల్ల ఒత్తిడి పెరగదు. కానీ దానిని పీల్చుకుంటే.. ప్రమాదం ఉంటుంది. తేమను పీల్చుకునే పరిస్థితి రాకుండా నిల్వ వాతావరణం పొడిగా ఉండాలి. లేకుంటే ప్రమాదం.
- భారత్ రెండున్నర లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇదంతా కూడా వైజాగ్ పోర్టు ద్వారానే జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో రవాణా జరగడం ప్రమాదకరం కాదా.. ?
సరైన భద్రతా చర్యలు ఉన్నప్పుడు ఎంత వచ్చినా ప్రమాదం లేదు. నిల్వచేయడం, రవాణాలో లోపాలు ఉంటే.. వంద టన్నులు వచ్చినా ప్రమాదమే..!
- విశాఖలో 20వేల టన్నుల నిల్వలు ఉంటున్నాయి. అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేసే యార్డుల్లో భద్రతా చర్యలు ఎలా ఉంటున్నాయి...?
అధికార వర్గాల నుంచి నాకున్న సమాచారం వరకూ.. భద్రతా చర్యలు సరిగ్గానే తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం మాన్యువల్ విధానంలో అగ్నిమాపక సాధనాలు పనిచేస్తున్నాయి. అలా కాకుండా భవిష్యత్‌లో అయినా ఆటోమేటిక్ సాధనాలు ఉంటే బాగుంటుంది. ఫైర్ అలారం మోగగానే.. స్ప్రింక్లర్లు వాటంతట అవే పనిచేయాలి. ఫోమ్ కూడా ఆ ప్రాంతంలో వెదజల్లాలి. ఇలా ఉంటే ప్రమాదాన్ని వెంటనే అరికట్టవచ్చు.
- విశాఖలో నిల్వచేస్తున్న ప్రదేశంపై కూడా కొంత ఆందోళన ఉంది. దానికి సమీపంలోనే విమానాశ్రయం, హెచ్‌పీసీఎల్ రిఫైనరీ, స్టాక్ పాయింట్ ఉన్నాయి....?
ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలు.. జనావాసాలకు దూరంగా ఉండటం మంచిది. అందులో మరో మాట లేదు. అయితే ఇప్పటికప్పుడు అది చేయడం సాధ్యం కాదు. కాబట్టి ప్రస్తుతం ఏం చేయాలన్నది ఆలోచించాలి. నిల్వచేసే చోట.. ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అది ఉత్తమం. దానికి పెద్ద ఖర్చు కూడా కాదు.
ఇదీ చదవండి