సెప్టెంబరు 1 నుంచి వసతి గృహాలను కూడా ప్రారంభించాలని అధికారులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల్లో కరోనా నియంత్రణ జాగ్రత్తలు కచ్చితంగా అమలయ్యేలా ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలని ఆదేశించారు. సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు, యూనివర్సిటీల వీసీలు, డీఈఓలు, డీఐఈఓలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.
వారి సహకారం తీసుకోవాలి
పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాల పునరుద్ధరణ తదితర అంశాలపై శ్రద్ధ చూపాలని సబిత అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని.. సహకరించకపోతే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. విద్యార్థుల కోసం శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, మాస్క్లు పెట్టుకునేలా చూడాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఎవరికైనా జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు.
ప్రైవేటు విద్యా సంస్థలపై కూడా
సీజనల్ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా కొవిడ్ నిబంధనల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. రవాణా సమయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని.. బస్సుల్లో శానిటైజేషన్ ప్రతి రోజు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలకు విద్యార్థులు వస్తున్నందున వారు వాతావరణానికి అలవాటుపడేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి పాల్గొన్నారు.
అలా వెనక్కి
కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్ బోధనకే పరిమితం చేశారు. గత నెల ఒకటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ సహా అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అన్నింటా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆన్‌లైన్ ఉండవు
విద్యాసంస్థల పునఃప్రారంభ సన్నద్ధతపై ఆగస్టు 24న కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలను శానిటైజేషన్ చేయించాలని మంత్రులు ఆదేశించారు. పురపాలక పాఠశాలల్లో కూడా వసతులు మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పాఠశాలల్లో శానిటైజేషన్ పనులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో భౌతికంగానే తరగతులు నిర్వహిస్తామని... ఆన్‌లైన్ తరగతులు ఉండవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : DRUGS CASE: డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ మొదలైంది..