కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో వసతి గుహాల్లో ఉంటున్న విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. హైదరాబాద్ అమీర్‌పేట, ఎస్ఆర్నగర్ పరిధిలోని ప్రైవేటు వసతిగృహాలను యాజమానులు మూసివేస్తున్నారు. అందులో ఉన్న విద్యార్థులను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ నిర్వాహకులు ఆదేశించారు. దీంతో దిక్కుతోచని విద్యార్థులు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు.
ఒక్కసారి సుమారు ఐదారు వందల మంది విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడం వల్ల పోలీసులు అయోమయానికి గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆధార్ కార్డు చూపించి, వాహనం సమకూర్చుకుంటే విద్యార్థులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని పశ్చిమ మండలం అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
ఐటీ కారిడార్‌లో..
గచ్చిబౌలి, మాదాపుర్, రాయదుర్గం ఐటీ కారిడార్‌లో ఉద్యోగాలు చేసే వందల మంది యువతీయువకులు వసతి గృహాల్లో నివాసం ఉంటున్నారు. నిర్వాహకులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరడం వల్ల స్వగ్రామాలకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోసం ఆయా పోలీస్స్టేషన్ల ముందు బారులు తీరారు.
బాలానగర్‌లో..
బాలానగర్ డివిజన్‌లోను ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు బాలానగర్ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్వోసీ పత్రాలు మంజూరుచేయాలని పోలీసులను కోరారు. వారందరూ ఇళ్లకు వెళ్లేందుకు పాసులు మంజూరుచేస్తున్నట్లు బాలానగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'