హోటల్ వ్యాపారంలో నష్టపోయిన ఓ జంట వలపు దందాకు తెరలేపింది. డబ్బు కోసం హనీట్రాప్ వేసింది. ఓ మతప్రచారకుడిని నట్టేట ముంచిన ఆ దంపతులు అతడి ఫిర్యాదుతో జైలుపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ప్రార్థన మందిరానికి గత ఆగస్టులో ఓ మహిళ(25) వచ్చింది. అక్కడి మతప్రచారకుడితో మాట కలిపింది. సికింద్రాబాద్‌లో చిన్నారుల అనాథాశ్రమం నడిపిస్తానని చెప్పింది. అతడి ఫోన్ నంబరు తీసుకుంది. తరచూ వాట్సప్ చాటింగ్ చేసేది. ఓ రోజు చిలుకూరు మృగవని పార్కుకు రమ్మంది. మరోసారి శంషాబాద్‌లోని రెస్టారెంట్‌లో భోజనానికి పిలిచింది. మూడోసారి వండర్‌లాకు రప్పించి, అతడితో సెల్ఫీలు దిగింది. ఆమె తరఫు వ్యక్తులు కూడా దూరం నుంచి వీరిద్దరి ఫొటోలు తీసేవారు. తర్వాత వగలాడి రెండో అంకానికి తెరలేపింది. తన భర్త హోటల్ వ్యాపారం చేస్తారని, విజయవాడలో ఏర్పాటు చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని వల విసిరింది. నమ్మిన బాధితుడు ఆమెకు రూ.10 లక్షలు ఇచ్చాడు.
రిసార్ట్ వేదికగా మత్తులో ముంచి...
గత నెలలో మాయలేడి అసలు పన్నాగం అమలు చేసింది. వ్యాపార చర్చ కోసం విజయవాడ నుంచి ప్రతినిధులు వస్తారని బాధితుడికి చెప్పింది. శంకర్‌పల్లి ప్రాంతంలోని ఓ రిసార్ట్‌కు రప్పించింది. అక్కడికి వచ్చిన ప్రతినిధులు అతడిని ఒక గదిలో వేచి ఉండమన్నారు. రాత్రి వేళ అకస్మాత్తుగా బాధితుడి ముందు ఆమె ప్రత్యక్షమైంది. అతడికి పానీయంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. బాధితుడు మత్తులోకి జారుకున్నాక, అతడితో సన్నిహితంగా ఉన్నట్లు చిత్రాలు, వీడియోలు తీసుకుంది. తెల్లవారుజామున అతడికి మెలకువ వచ్చి చూసేసరికి స్నానాలగదిలో టబ్‌లో ఉన్నాడు. అదే సమయంలో స్నానాల గదిలోకి వచ్చిన ఆమె భర్త బాధితుడిని గదిలోకి తీసుకొచ్చాడు. తన భార్యను, బాధితుడిని చితకబాదాడు. తుపాకీ చూపించి చంపేస్తానంటూ ఊగిపోయాడు. బాధితుడు ప్రాధేయపడటంతో తనకు రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ డబ్బు కోసం ఒప్పంద పత్రం రాయించుకుని వదిలిపెట్టాడు. మరుసటి రోజు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.పది లక్షలు ఇచ్చాడు. మిగిలిన డబ్బు కోసం వేధింపులు పెరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కపటనాటకం బహిర్గతం
సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఆ జంట కపటనాటకం బహిర్గతమైంది. ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిందని, భర్త గతంలో హైదరాబాద్‌లో ఏడు హోటళ్లు నడిపాడని వెల్లడైంది. వ్యాపారంలో నష్టం రావడంతో దంపతులు ఈ దందాకు దిగారని గుర్తించారు. నాంపల్లిలో బొమ్మ తుపాకీ కొని పథకాన్ని అమలు చేసినట్లు తేలింది. ఆమెకు గతంలో పరిచయమైన ఓ ప్రవాసభారతీయుడికి వల వేసేందుకు ఇటీవల చాటింగ్ మొదలుపెట్టినట్లు గుర్తించారు. దంపతుల మోసాలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.