గణేష్ నిమజ్జనోత్సం, మొహర్రం ఊరేగింపు తదితర అంశాలపై హోంమంత్రి మహమూద్ అలీ... పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఆయా ఉత్సవాలు, ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చేపట్టిన చర్యలను హోం మంత్రి అభినందించారు. కోవిడ్ వైరస్ వ్యాపించకుండా పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరు, బాధితులను ఆదుకునేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సమావేశంలో అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ ఏసీపీ సుధీర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
మక్కా మసీదు, షాహీ మసీదులో ప్రార్థనల పునరుద్ధరణపై... హోం మంత్రి ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రెండు మసీదులలో 50 మందికి అనుమతించరు. ఈ నెల 5 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రార్థనల సమయంలో ముసుగులు ఉపయోగించడం ద్వారా సామాజిక దూరాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్లలోపు, 65 ఏళ్లు పైబడిన వారు తమ ఇళ్లలో ప్రార్థనలు చేయాలని కోరారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్ ఖాన్, అహ్మద్ పాషా ఖాద్రి, మైనారిటీల సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్, ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: హైఅలర్ట్: ఐటీబీపీకి హోంశాఖ కీలక ఆదేశాలు!