నిర్దిష్ట కాలపరిమితిలో ఉప్పల్ స్కైవే, మెహదీపట్నం స్కైవే నిర్మాణ పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆదేశించారు. ఉప్పల్ స్కైవే 3డీ మోడల్‌ను ఆయన పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొత్త ఏడాది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యాచరణతో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో అర్వింద్ కుమార్ సమావేశం నిర్వహించారు. గతేడాదిలో కొవిడ్ కారణంగా అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ వాటిని అధిగమించి ఈ ఏడాదిలో పురోగతిని సాధించాలని అధికారులకు సూచించారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.