Hijab Controversy: హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఓ పాఠశాలలో హిజాబ్ వివాదమంటూ నకిలీ వార్త పోలీసులను అలజడికి గురిచేసింది. బహదూర్‌పురాలోని గౌతం మోడల్ స్కూల్లో హిజాబ్ ధరించకూడదని యాజమాన్యం చెప్పడంతో.. విద్యార్థుల ఆందోళన అని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టి విచారించగా అసలు విషయం బయటపడింది.
ఏం జరిగిందంటే..
అక్కడ ఎలాంటి హిజాబ్ వివాదం లేదని పోలీసులు తేల్చారు. స్కూలు వైస్ ప్రిన్సిపల్ ఇస్మాయిల్ భౌతికశాస్త్రం బోధిస్తాడు. అయితే యాజమాన్యం అనుమతి లేకుండా సెలవు తీసుకోవడం.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడిని వేరే బ్రాంచ్‌కు బదిలీ చేసింది. దీంతో అతనికి అనుకూలంగా ఉన్న విద్యార్థులు, కొందరు బయటి వ్యక్తులు వచ్చి స్కూల్ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఇస్మాయిల్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో ఓ విద్యార్థికి లాఠీ తగిలింది. దీనంతటికీ కారణమైన ఇస్మాయిల్‌ను పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు నకిలీ వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని బహదూర్‌పురా సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:ఒంటరిగా ఉన్న గర్భిణిపై కత్తితో బెదిరించి లైంగికదాడికి యత్నం..