Bail in Paper Leakage Case: ఏపీలో పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడితో పాటు మరో 10 మందికి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్‌తో పాటు పలు విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అందరికీ ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వ్యాజ్యాలపై పూర్తి స్థాయి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
చిత్తూరు టాకీస్ వాట్సప్ గ్రూప్‌లో పదో తరగతి తెలుగు ప్రశ్నప్రతాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేసినట్లు చిత్తూరు డీఈవో పురుషోత్తం ఏప్రిల్ 27న చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రమేయం ఉందని మాజీ మంత్రి నారాయణను మే 10న చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. చిత్తూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి సులోచనా రాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిలు మంజూరు చేశారు.