కరోనా చికిత్సకు అధిక చార్జీలు వసూలు చేశారన్న ఆరోపణలపై... గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం వివరణ తీసుకోకుండానే రిజిస్ట్రేషన్ రద్దుకు నోటీసు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువగా తీసుకున్నారని ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా... హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గ్లోబల్ ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. యాజమాన్యం తమ ఎదుట హాజరై... ఆసుపత్రి రిజిస్ట్రేషన్ పత్రాలు వెనక్కి ఇచ్చేయాలని ఈ నెల 10న జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.
నోటీసులను సవాల్ చేస్తూ ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కొన్నేళ్లుగా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని... ప్రస్తుతం 57 మంది కరోనా చికిత్స పొందుతుండగా... లైసెన్సు రద్దు చేస్తే రోగులు ఇబ్బంది పడతారని యాజమాన్యం తెలిపింది. డీఎంహెచ్ఓ జారీ చేసిన నోటీసు చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆసుపత్రి తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.
ప్రభుత్వ ఉత్తర్వులు, షరతులు ఉల్లంఘిస్తే.. వివరణ కోరిన తర్వాత అవసరమైతే కారణాలు వివరించి రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చునని చట్టంలో ఉందని న్యాయవాది వివరించారు. అయితే కరోనా చికిత్సలకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రైవేట్ ఆస్పత్రులపై అనేక ఆరోపణలు వస్తున్నాయన్న ఏజీ... ఫిర్యాదుల మేరకే డీఎంహెచ్ఓ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... నోటీసును కొట్టివేసింది. నిబంధనల ప్రకారం మరోసారి నోటీసులు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది.