ఈరోజు, రేపు ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.
మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతములో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో... పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ ఉదయం ఐదున్నరకు అల్పపీడనం ఏర్పడినట్టు తెలిపారు. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి... మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చూడండి: గురు, శుక్రవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు