అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని పాత ప్లాట్లు.. నిర్మాణాలు రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆస్తుల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం పెద్దఎత్తున ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తరలివచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సందడిగా మారాయి. రోజుకు 20 నుంచి 30 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. 50 నుంచి 100 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనల సడలింపుతో మూడున్నర నెలలుగా వేచి చూస్తున్న క్రయవిక్రయదారులు తమ ఆస్తులకు చెందిన రిజిస్ట్రేషన్లు చేయించుకోడానికి... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తరలి వచ్చారు. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి.
ఒక్కరోజే 7వేలకు పైగా
3 నెలలు విరామం తర్వాత ఈ నెల 21 నుంచి పాత విధానంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ఒక్కసారిగా క్యూ కట్టడంతో రిజిస్ట్రేషన్ల శాఖపై ఒత్తిడి పెరిగింది. రోజుకు మూడువేలకుపైగా డాక్యుమెట్లు జరుగుతుండగా... బుధవారం ఒక్కరోజే 7002 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. తద్వారా ప్రభుత్వానికి 121.80 కోట్ల రాబడి వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం మునుపెన్నడూ జరగలేదు. రిజిస్ట్రేషన్ల కోసం ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకుని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లినా…రద్దీ అధికంగా ఉండటంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద.. ఉదయం నుంచి రాత్రివరకు పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆస్తుల క్రయవిక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెట్టింపు రిజిస్ట్రేషన్లు
నిర్దేశించిన సంఖ్య కంటే రెట్టింపు రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో.. ఏ రోజుకు ఆ రోజు పనులు పూర్తి చేసి పెండింగ్ లేకుండా చూడాల్సి ఉండడంతో ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తోందని సబ్ రిజిస్ట్రార్లు తెలిపారు.
ఇదీ చదవండి: ధరణి, రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష