పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో నిన్నటి రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నమండెంలో అత్యధికంగా 13.54 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వీరబల్లి, రాజంపేట, జమ్మలమడుగు డివిజన్లలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వేరుశనగ పంట నీట మునగడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నా, పాపాగ్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కడపలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, కోర్టు రోడ్డు, అంబేడ్కర్ కూడలి, మృత్యుంజయ కుంట, భాగ్యనగర్ కాలనీలు నీటమునిగాయి. మురుగు వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. బద్వేల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్, మైదుకూర్ రోడ్లపై మురుగునీరు ప్రవహించడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కుండపోత వర్షాలు
ప్రకాశం జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. వర్షం ధాటికి తోకపల్లిలో సుమారు 30 ఎకరాల్లో చిక్కుడు, టమాట పంటలు నీట మునిగాయి. పత్తి చేలల్లోకి కూడా నీరు చేరడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
పడిపోయిన వృక్షం
భారీ వర్షానికి కర్నూలు జిల్లా నంద్యాల- గిద్దలూరు రహదారిపై సర్వ నరసింహస్వామి ఆలయ సమీపంలో చెట్టు పడిపోయింది. దీంతో కొంత సమయం పాటు ట్రాఫిక్ ఏర్పడింది. స్థానికులు చెట్టును తొలగించడంతో వాహనదారులు రాకపోకలు సాగించారు.
తీరప్రాంతాలపై ప్రత్యేకదృష్టి
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు తీర ప్రాంత గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
చిత్రావతి పరవళ్లు
పుట్టపర్తిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. చిత్రావతి నదిపై నిర్మించిన చెక్ డ్యాములపై నుంచి వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. చిత్రావతి నుంచి రాయలసీమలోని అతి పెద్ద చెరువు బుక్కపట్నం చెరువులోకి వరద నీరు చేరుతోంది.
ఇవీ చూడండి: రెండ్రోజులు వానలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : కేసీఆర్