రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 43.4 డిగ్రీలు, నిజామాద్ రూరల్ 42.1, నిజామాబాద్ డిచ్‌పల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండ తీవ్రతకు జనాలు అల్లాడుతున్నారు. బయటకు వచ్చిన వ్యక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక కొబ్బరి బొండాలు, జ్యూస్‌లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. ఆదిలాబాద్‌లో ఆదివారం రాత్రి గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నిజామాబాద్‌లలో 27, హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 26, దుండిగల్‌లో 25, హనుమకొండలో 24 డిగ్రీల మేర రికార్డయ్యాయి. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో పగటి పూట ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.
ఇదీ చదవండి : నాన్న జేబులోంచి రూ.300 తీసుకొని పారిపోయి.. పాన్ ఇండియా స్టార్‌గా..!