హైదరాబాద్ మెట్రోలో అవయవమార్పిడి కోసం తొలిసారి గుండెను తరలించారు. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను తీసుకెళ్లారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు నాన్ స్టాప్ మెట్రో రైల్‌ను ఏర్పాటు చేశారు. మెట్రో రైలు అధికారులకు ఆస్పత్రి సిబ్బంది ముందుగా సమాచారం ఇచ్చారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో గుండెను తరలించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకోగా.. తొలిసారి హైదరాబాద్ మెట్రో గ్రీన్ కారిడార్‌గా మారింది.


నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల నర్సిరెడ్డి అనే రైతు బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన గుండెను దానం చేసేందుకు రైతు కుటుంబం ముందుకొచ్చింది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలోని ఓ వ్యక్తికి గుండె మార్పిడి కోసం శస్త్రచికిత్సకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుండెను అపోలో ఆస్పత్రికి తరలించేందుకు నాగోల్‌లో ఓ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. నర్సిరెడ్డి గుండెను మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో కామినేని నుంచి గుండెను తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్ వరకు అంబులెన్సులో రోడ్డుమార్గాన గుండెను తరలించారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు మెట్రో రైలులో తీసుకెళ్లారు.

మొత్తం 21 కిలోమీటర్లు... 16 స్టేషన్స్‌ను నాగోల్- జూబ్లీహిల్స్ నడుమ ఈ రైలు దాటింది. కేవలం 30 నిమిషాల లోపుగానే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో జూబ్లీహిల్స్ చేరింది. అన్ని స్టేషన్స్లోనూ పీఏ సిస్టమ్ ద్వారా ఈ ప్రత్యేక రైలు గురించి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి గుండెను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలో జరగనున్న గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం... గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ మెట్రో రికార్డు సృష్టించింది.
