కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విశాఖ న్యాయవాది నిమ్మిగ్రేస్ వేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పిటిషనర్ వాదనలు విని సంతృప్తి చెందింది. పలు కంపెనీల నెట్వర్క్ ప్రొవైడర్స్‌కు, సీబీఐ, సీవీసీలకు నోటీసులు జారీ చేశారని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్‌కుమార్.. జస్టిస్ రాకేశ్‌కుమార్ బెంచ్‌కు వివరించారు.
ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వాదనలు విని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినందునా... ఈ కేసు విచారణ ఆ బెంచ్‌లోనే ఉంటే బాగుంటుందని జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్ అభిప్రాయపడిందని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్ తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు, న్యాయమూర్తుల కదలికలను తెలుసుకునేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 40 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నట్లు న్యాయవాది శ్రవణ్ తెలిపారు.
ఇదీ చదవండీ...ఎరువుల సరఫరాపై సదానందగౌడతో కిషన్‌రెడ్డి భేటీ