మున్సిపల్ ఎన్నికలపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను హడావుడిగా చేస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కొట్టివేసినప్పటికీ... సింగిల్ జడ్జి వద్ద 79 రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఇవాళ విచారణ చేపట్టారు. పెండింగ్లో ఉన్న పిటిషన్లన్నీ ఒకేసారి కొట్టివేయాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. పిటిషన్లలో పేర్కొన్న ఓటరు జాబితా సవరణ, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యంతరాలన్నింటినీ... సీజే ధర్మాసనం విచారణ చేపట్టి కొట్టివేసిందని పేర్కొన్నారు. కాబట్టి రిట్ పిటిషన్లను కూడా కొట్టివేస్తే... ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. కనీసం స్టే ఉత్తర్వులను తొలగించాలని కోరారు.
మా వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకోండి...
ప్రభుత్వం వాదనపై పిటిషనర్ల తరఫున న్యాయవాదులు మూకుమ్మడిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వాదించారు. సీజే ధర్మాసనం విచారణ జరిపిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో పేర్కొన్న అంశాలు.. తమ పిటిషన్లలో అంశాలు వేర్వేరని తెలిపారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో జీవోను సవాల్ చేశారని.. కానీ తాము జీవో అమలు విధానాన్ని తప్పుబడుతున్నామన్నారు. అన్ని పిటిషన్లపై కలిపి ప్రభుత్వం ఒకే కౌంటరు దాఖలు చేయడం సరికాదన్నారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి... పిటిషన్లపై వేర్వేరుగా వాదనలు విని ఒక్కొక్కటిగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇవాళ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... తదుపరి వాదనలను రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: చెన్నమనేని రమేశ్ భారత్ పౌరుడు కాదు: కేంద్ర హోంశాఖ