Notice to Bandi Sanjay : ముఖ్యమంత్రిని అవమానపరిచే విధంగా కార్యక్రమం నిర్వహించినందుకు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌కు 41-ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు హయత్ నగర్ పోలీసులు తెలిపారు. ఈ నెల 12న నోటీసులు జారీ చేశామని... నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నట్లు హయత్ నగర్ పోలీసులు పేర్కొన్నారు.
ఈ నెల 2న నాగోల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిట్ట బాలకృష్ణా రెడ్డి, రాణి రుద్రమ, దరువు ఎల్లన్న నిర్వాహకులుగా వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆవిర్భావ వేడుకల కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని.. రాజ్యాగబద్ధంగా ఎన్నికైన సీఎంను అవమానపరిచేలా కార్యక్రమాలు నిర్వహించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
తెరాస సామాజిక మాధ్యమాల కన్వీనర్ సతీష్ రెడ్డి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమానికి సంబంధించిన వీడియోను పరిశీలించిన తర్వాత కేసీఆర్ చిత్రంతో ఉన్న మాస్క్‌ను ధరించిన వక్తి, వ్యగ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఏ-1గా బండి సంజయ్, ఏ-2గా జిట్టా బాలకృష్ణా రెడ్డి, ఏ-3గా రాణి రుద్రమ, ఏ-4గా దరువు ఎల్లన్నను చేర్చారు. ఈ నెల 10న జిట్టా బాలకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. రాణి రుద్రమ, దరువు ఎల్లన్నను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ నోటీసులకు స్పందించకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హయత్ నగర్ పోలీసులు సిద్ధమవుతున్నారు.