సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టింది హర్‌సంజమ్ కౌర్. ముద్దుగా హ్యారీ అంటారు. ఇంగ్లండ్‌లో ఎంబీఏ చేసింది. కానీ కెరియర్‌లో ఎందుకో కుదురుకోలేదు. ఈలోపు పెళ్లయింది. వాళ్లది కోల్‌కతా అయినా భర్త ఉద్యోగరీత్యా చాలా సంవత్సరాలు ఎన్నో ఊళ్లలో గడిపారు. ఊరు మారిన ప్రతిసారీ ఇంటిని చక్కబెట్టుకోవడం ఆమెకి తెగ సరదాగా ఉండేది. కొత్తగా ఇల్లు సర్ది ముచ్చట పడుతున్నప్పుడు ఇంటీరియర్ డిజైన్ నేర్చుకుంటే ఇంకెంత బాగుండునో అనుకుని, ఆ కోర్సు చేసింది. తర్వాత అదే వృత్తి అయింది. అందులో విజయవంతమైంది. కానీ భర్త సంపాదన, తన కెరియర్‌తో పెద్దగా ఆనందమేమీ కలిగేది కాదు. మొదటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అవసరార్థులని ఆదుకున్న రోజున సంతోషం కలిగేది. తన సిసలైన ఆసక్తి సేవ అనిపించేది.
2018లో ‘ఆంగన్’
ఒకసారి ‘అమ్మూకేర్’ అనే సంస్థ ట్రెక్కింగ్, మెడిటేషన్‌ల కోసం మౌంట్ కైలాశ్ ట్రిప్ వేసింది. కొంచెం మార్పు ఉంటుందని అక్కడికి వెళ్లింది. దేశ విదేశాల నుంచి ఎందరో వచ్చారు. వాళ్లలో ఒక్కరికీ డబ్బు, హోదాల రంది లేదు. అందరిలో సేవాతత్పరతే. ఆ యాత్ర ఆమె జీవనవైఖరిని మార్చేసింది. తానూ సేవ చేయాలనుకుంది. 2018లో ‘ఆంగన్’ ఆరంభించింది. అమ్మూకేర్ స్థాపకుని పేరుతో ప్రేమగా ‘మోహన్‌జీ కా ఆంగన్’ అంటారు. ఇళ్లలో హింసించే వ్యక్తుల వల్ల భార్యలకే కాదు పిల్లలకీ నరకమే. వాళ్లని ఆదరించాలనేది ఆమె తపన. కూలీలు తమ పిల్లల్ని ఇక్కడ వదిలి పనికి వెళ్తారు. వాళ్లకి చదువుతోబాటు ఆహారం, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తుంది హ్యారీ. పేద కుటుంబాలకు నిత్యావసర సామగ్రితో మంత్లీ కిట్ ఇస్తుంది. పిల్లల్ని ఉత్సాహంగా ఉంచేందుకు ఆటపాటలూ, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.
పదివేల మందికి భోజనం...
‘ఆంగన్’ విజయవంతంగా నడుస్తుండగా కరోనా విపత్తు వచ్చింది. దానివల్ల ఎందరివో జీవితాలు తల్లకిందులయ్యాయి. ముఖ్యంగా వలస కూలీల జీవితాలు చితికిపోయాయి. ఆనందంగా గడపాల్సిన చిన్నారులు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో ఉండటం కౌర్‌ను కదిలించింది. లాక్‌డౌన్‌లో ఆంగన్‌ను మూసినా భోజన ఏర్పాటు ఆగలేదు. అధికారులు, పోలీసుల సాయంతో పదివేల మందికి భోజనం, మాస్కులు, శానిటైజర్లు అందించింది. ఇది అనుకున్నంత సులువేమీ కాదంటుందామె. సంచార జీవితానికి అలవాటు పడిన చిన్నారులు ఒకచోట కూర్చోడానికి ఇష్టపడక పారిపోవడానికి చూస్తారు. క్రమశిక్షణ ముఖ్యమని లాలనతోనే కట్టిపడేస్తుంది. తల్లిదండ్రులు తమ కష్టనష్టాలు చెప్తుంటారు. ఒక ఐదేళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు లైంగికంగా వేధించాడు. ఇలాంటి అమానవీయ ఘటనలతో తల్లులు భీతిల్లి ఉంటారు. ఆంగన్ వీలైనంత వరకూ వాటిని పరిష్కరిస్తుంది. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషిచేస్తుంది. చిన్నారులకు కళలూ, యోగా కూడా నేర్పిస్తూ చక్కటి వాతావరణాన్ని కల్పిస్తోంది. వీళ్లకోసం వసతిగృహం ఏర్పాటుచేసి పూర్తి భద్రత కల్పించాలని, చురుగ్గా ఉన్న పిల్లల్ని పై చదువులు చదివించాలని ప్రయత్నిస్తోంది హ్యారీ.
ఇదీ చూడండి: CORONA THIRD WAVE: స్వీయ నియంత్రణ మరిస్తే మూడో ముప్పు తప్పదు..!