Harish Rao on Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవాలన్న కొందరి కలలు కల్లలయ్యాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా ఈ నెలలోనే పైసా ఖర్చుపెట్టకుండా నీళ్లిస్తామన్న ఆయన.. యాసంగిలో ఒక్కగుంట కూడా ఎండిపోకుండా నీరందించి చూపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కేంద్రమంత్రులు చేస్తున్న విమర్శల్ని కొట్టిపారేశారు. శాసనమండలిలో ‘రాష్ట్రంలో అతివృష్టి, గోదావరి పరివాహక ప్రాంతాల పరిస్థితి’పై జరిగిన స్వల్ప కాలిక చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. కాళేశ్వరం అనుమతి పత్రాలను మండలిలో చూపించారు. కేంద్రం ఇచ్చిన అనుమతుల వివరాలను చదివి సభ్యులకు వినిపించారు. కాళేశ్వరం అద్భుతమని సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి నేర్చుకొనేందుకు వచ్చామని ఆయనే అన్నారన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తన నియోజకవర్గంలో కాళేశ్వరం నీరు ఇచ్చారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వరదలు వస్తే అందరం కలిసి ప్రభుత్వానికి సహాయపడ్డామని హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు చాలా దిగజారాయన్నారు. వరదల్లో కూడా ప్రతిపక్షాలకు రాజకీయాలు కావాలి.. కాళేశ్వరంలో ప్రభుత్వ వైఫల్యం ఏదో ఉందని నిరూపించాలని ఆరాటపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవ్వకూడదని కోరుకున్నాయన్నారు. అన్నారం పంప్ హౌస్ నుంచి ఈ నెల మూడో వారంలో నీరు పోస్తామని పేర్కొన్నారు. మేడిగడ్డ పంప్ హౌస్‌కు వచ్చే నెలలో నీరు ఇస్తామని తెలిపారు.
'కాళేశ్వరం వచ్చాక ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నాం. రెండు కోట్ల 59లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. కాళస్త్రశ్వరం వంటి మెగా ప్రాజెక్టుల పూర్తి వల్లే ఇంత ఉత్పత్తి సాధ్యమైంది. ఓ కేంద్రమంత్రి కాళేశ్వరం ద్వారా ఒక ఎకరా పారలేదని ఆరోపించారు. మరో కేంద్రమంత్రి కాళేశ్వరం డీపీఆర్‌లేదని అన్నారు. డీపీఆర్ లేదన్న కాళేశ్వరానికి సీడబ్ల్యూసీ 10 అనుమతులు ఇచ్చింది. డీపీఆర్‌ను క్షుణ్నంగా పరిశీలించాకే అనుమతులిచ్చారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులూ ఇచ్చింది కేంద్రమే. తెలంగాణలో పండిన పంటను మేం కొనలేమంటూ కేంద్రం చేతులెత్తేసింది. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం. కానీ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం తెలంగాణకు శనీశ్వరంలా దాపురించాయి. వాస్తవాలు మాట్లాడితే విశ్వసనీయత మీ పెరుగుతుంది. కాళేశ్వరం ద్వారా డబ్బు ఆదా చేశాం.. జీడీపీని పెంచుకొన్నాం. ఈ మెగా ప్రాజెక్టు పూర్తి చేశాక భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగాయి. కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడేం చెబుతారు?'-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇవీ చదవండి: