GST on handloom silk fabrics: ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం, చిత్తూరు జిల్లా మదనపల్లె... పట్టు చీరల తయారీకి ప్రసిద్ధి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా చీరాల, నెల్లూరు జిల్లా వెంకటగిరి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, తదితర ప్రాంతాల్లో ప్రఖ్యాత పట్టు చీరలను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ భాగం ముడి పట్టు మార్కెటింగ్ అంతా కర్ణాటక కేంద్రంగానే సాగుతోంది. సాధారణంగా డిసెంబరు, జనవరి నెలలు పండగ సీజన్. మాఘ మాసంలోనూ శుభకార్యాలకు పెద్ద ఎత్తున చేనేతలకు వ్యాపారం ఉంటుంది. ఇందుకోసం ముందస్తుగా ముడి పట్టుకొని పట్టు చీరలను నేసి నిల్వ ఉంచుతారు. ఈ ఏడాది ముడి పట్టు ధర పెరుగుదలతో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే కొనుగోలు చేసిన సరకుతో నెట్టుకొస్తున్నారు.
ఉత్పత్తిపై ప్రభావం
silk weavers struggle over Raised raw silk Price: ఒక్కో పట్టు చీరకు డిజైన్‌కు అనుగుణంగా 600 గ్రాముల నుంచి 1,200 గ్రాముల వరకు యార్న్‌ను వాడతారు. గతంతో పోలిస్తే యార్న్ కొనుగోలుకు 3 చీరలకు అయ్యే పెట్టుబడిని ఇప్పుడు ఒకదాని మీదే పెట్టాల్సి వస్తోందని చేనేత కార్మికులు వాపోతున్నారు. మూడు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుత ధర ప్రకారం 10 పట్టు చీరలపై అదనంగా రూ.14వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని ధర్మవరానికి చెందిన కార్మికులు వాపోతున్నారు. ఆ ప్రకారం చీర ధరను పెంచితే కొనుగోలుకు వినియోగదారులు వెనకడుగు వేస్తారనే ఆలోచనతో దుకాణ యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. వారానికి రెండు, మూడు చీరలు నేసేవారు ఒక దానికే పరిమితం అవుతున్నారు. చీరల ఉత్పత్తి తగ్గించడంతో ఆ మేరకు కార్మికుల కూలీ తగ్గుతోంది. ఇది మాస్టర్ వీవర్స్ దగ్గర పని చేస్తున్న కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. ధర్మవరంలో మాస్టర్ వీవర్స్ ఇప్పటికే 10-20% మేర మగ్గాల్ని నిలిపేశారు. కొంతమంది తక్కువ డిజైన్ ఉన్న చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. చేనేత అనుబంధ రంగాలైన రంగుల అద్దకం, వార్పింగ్, అచ్చు అతకడం తదితరాలపైనా ఈ ప్రభావం పడుతోంది. మరికొంత కాలంలో ఇదే ధరలు కొనసాగితే మగ్గాలన్నీ నిలిపేసే పరిస్థితులు ఉన్నాయని మాస్టర్ వీవర్స్ చెబుతున్నారు.
జీఎస్టీ పెరుగుదల పెనుభారమే..
handloom workers problems: ప్రస్తుతం చేనేత ముడిసరకుపై జీఎస్టీ 5 శాతం ఉంది. జనవరి నుంచి 12 శాతానికి పెరగనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది చేనేత కార్మికులకు మరింత భారంగా మారనుంది. యార్న్‌పై జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ 10శాతం రాయితీ ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న 5 శాతం జీఎస్టీనే భరించలేని పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఉన్నారు. ఇక 12 శాతానికి పెరిగితే ఎన్‌హెచ్‌డీపీ రాయితీపోనూ మరో 2 శాతం చేనేతలపైనే పడనుంది.
మగ్గాలు నిలిపేయాల్సి వస్తోంది
మా దగ్గర 100 మగ్గాలున్నాయి. గతంలో ఒక్కో మగ్గం నుంచి వారానికి 3 చీరలు ఉత్పత్తి అయ్యేవి. ముడిపట్టు ధర పెరుగుదలతో ఇప్పుడు వారానికి ఒక చీరనే నేయిస్తున్నాం. ప్రస్తుత ధర గిట్టుబాటు కావడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా చీర ధర పెంచితే దుకాణ యజమానులు కొనరు. ఇదే పరిస్థితి కొన్నాళ్లపాటు కొనసాగితే మగ్గాలు నిలిపేయడమే గతి. - భావనారాయణ, మాస్టర్ వీవర్, మదనపల్లె
30 ఏళ్లలో ఇంత ధర లేదు
ధర్మవరంలో పడుగు ధర రూ.6,100, పేక ధర రూ.5,750 ఉంది. 30 ఏళ్లలో ఇంత ధర ఎప్పుడూ లేదు. జీఎస్టీ పెరిగితే మరింత భారం అవుతుంది. అందుకే కొత్త మగ్గాలు పెంచాలనే నిర్ణయాన్ని పక్కనపెట్టా. - నాగరాజు, మాస్టర్ వీవర్, ధర్మవరం
ఇదీ చదవండి: CS Respond: ఈటీవీ భారత్ కథనాలపై సీఎస్ స్పందన.. విద్యార్థులకు దుప్పట్లు పంపాలని ఆదేశం