మెరుపు వేగంతో దూసుకుపోతోంది హసిత. పాస్.. పాస్.. అంటోంది. ఫుట్‌బాల్ గేమ్ జోరుగా సాగుతోందక్కడ. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఎందుకో హసిత వేగం మందగించింది. మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. రోజులు గడిచాయి.. ‘పెద్దగా ఇబ్బందేం లేదు. కాస్త బరువు తగ్గితే అంతా మామూలవుతుంది’ అన్నారు వైద్యులు. ఏడాది గడిచింది.. ‘ఇక మీ అమ్మాయి నడవలేదు’ అన్నారు వైద్యులు. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక.. నడవలేక నడవలేక కూలబడేది హసిత. కూతుర్ని చూసి బావురుమనేవారు తల్లిదండ్రులు...
చిరుత పరుగు ఆగింది..
హసితా ఇల్లా పుట్టింది వాళ్ల అమ్మమ్మా వాళ్లుండే కాకినాడలో. తండ్రి రాజు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అమ్మ శారద డిగ్రీ చదివింది. హసిత పుట్టిన ఏడాదే ఆయనకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. కుటుంబంతో వెళ్లిపోయారు. కొన్నాళ్లకు తమ్ముడు పుట్టాడు. చిన్న కుటుంబం.. చింతల్లేని కుటుంబం. కోరింది చేసిపెట్టే అమ్మ. కోరినంత స్వేచ్ఛనిచ్చిన నాన్న. ఆడిందే ఆట.. పాడిందే పాట. చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండేది హసిత. స్విమ్మింగ్ చేసేది. జిమ్నాస్టిక్స్‌లో రఫ్పాడించేది. ఫుట్‌బాల్‌లో చిరుతలా పరుగులు తీసేది. కానీ, అనుకోకుండా ఓ రోజు కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది హసిత. ‘ఆ రోజు మ్యాచ్ అయిపోయాక ఇంటికి వచ్చా. ఒంగి నడుస్తుంటే ఏమైందన్నారు అమ్మానాన్న. నొప్పి లేదు. కానీ, నిలబడలేకపోతున్నా. ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాస్త బరువు తగ్గమనండి అన్నారు వైద్యులు. తర్వాత ఏడాదికి గానీ అటాక్సియా అనే నరాల వ్యాధిగా గుర్తించలేకపోయారు. ఇది మెదడు, వెన్నులోని భాగాలను నాశనం చేస్తుంది. మెదడు ఇచ్చే సంకేతాలు అవయవాలు అందుకోవు.. ఫలితంగా కాళ్లు పనిచేయకుండా పోయాయి’ అని గుర్తు చేసుకుంది హసిత.
శక్తినంతా కూడదీసుకున్నా..
జబ్బు తగ్గడానికి హసిత తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు. అయినా ఫలితం దక్కలేదు. ఈలోగా ఆ చిన్నారి నడక పూర్తిగా మారిపోయింది. ఎవరైనా సాయం చేస్తే గానీ అడుగు వేయలేని పరిస్థితికి వచ్చేసింది. బడిలో పిల్లలు నవ్వేవారు. ఏడిపించేవారు. అన్నీ భరించలేక.. శక్తినంతా కూడదీసుకొని మామూలుగా నడవాలని ప్రయత్నించేది. కాళ్లు వంకర్లు తిరిగి పడిపోయేది. ‘ఇంటికొచ్చి ఏడ్చేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. శారీరకంగా, మానసికంగా కుంగిపోయా. తీవ్రమైన ఒత్తిడికి గురైన నన్ను.. ఇండియాకు తీసుకొచ్చారు అమ్మానాన్న. మనదేశంలో అడుగుపెట్టేనాటికి చక్రాల కుర్చీ నాకు ఆసరా అయ్యింది’ అని చెప్పుకొచ్చింది హసిత.
హాస్టల్‌లో ఒంటరిగా..
ఇండియాకు వచ్చాక హసిత కుటుంబం చెన్నైలో ఉండేది. తండ్రి ఉద్యోగం పుణెలో. చెన్నైలో ఓ స్కూల్‌లో తొమ్మిదో తరగతిలో చేరింది. ఇక్కడ ఉపాధ్యాయులు హసితను అర్థం చేసుకున్నారు. విద్యార్థులు ఆమెకు అండగా నిలిచారు. చక్రాల కుర్చీలో కాకుండా తమ్ముడి సాయంతో నెమ్మదిగా పాఠశాలకు వెళ్లేది. కొన్నాళ్లకు మానసికంగా స్థిమితపడింది. ఒక్కో క్లాసూ పాసవుతూ ఎంసెట్‌లో ర్యాంకు సాధించింది. పుణెలో బీటెక్ మైక్రోబయాలజీలో చేరింది. హాస్టల్‌లో ఉండమంది తల్లి. హసితకు ఏం అర్థం కాలేదు. ‘ఒంటరిగా ఉంటే.. నేను నేనుగా నిలబడగలనని అమ్మ నమ్మకం. అందుకే హాస్టల్‌లో ఉండమంది. నాలుగేళ్ల బీటెక్‌లో చాలా కష్టపడ్డా! పాఠాలే కాదు.. ఎలా జీవించాలో కూడా నేర్చుకున్నా’ అంటుంది హసిత. బీటెక్‌లో ఉండగానే హైదరాబాద్, సీసీఎంబీలో ఆరునెలల ప్రాజెక్ట్ చేసింది. ప్రాజెక్ట్ వివరాలు బ్లాగ్‌లో రాయాల్సి వచ్చేది. అప్పుడే సొంతంగా తనూ బ్లాగ్ రాయాలనుకుంది. అలా ‘టర్నింగ్ పాయింట్5’ బ్లాగ్ మొదలుపెట్టింది. తనలాంటి ఎందరో దివ్యాంగుల గురించి బ్లాగ్‌లో రాస్తుందామె. ప్రముఖుల రచనలపై రివ్యూలు రాసేస్తోంది.
గ్లోబల్ పురస్కారం..
బ్లాగ్ నిర్వహిస్తూనే ‘లైఫ్‌విత్‌హసీ.కామ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. ఇందులో తన వ్యక్తిగత అనుభవాలు, మహిళలకు సంబంధించిన అంశాలను పొందుపరుస్తోంది. ‘న్యూరాలజీపై పీహెచ్‌డీలో చేరాలనుకుంటున్నా. త్వరలో పుస్తక రచన ప్రారంభిస్తున్నా. గతేడాది నవంబరులో దిల్లీలో ఉమెన్ ఫర్ ఇండియా పేరుతో ‘గ్లోబల్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ అవార్డు’ను అందుకున్నా. మిస్ వీల్‌ఛైర్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నా’ అని వైకల్యాన్ని ఎదిరించిన తీరును చెబుతోంది 24 ఏళ్ల హసిత. పాఠశాలలు, కళాశాలలు సందర్శిస్తూ స్ఫూర్తిధాయక ఉపన్యాసాలు ఇస్తోంది.