రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు సాగింది. గెలిచిన వారంతా తెరాస మద్దతుదారులే. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.
రాష్ట్రంలోని మొత్తం 905 సంఘాలలో 12,100 వార్డులుండగా... సగానికి పైగా ఏకగ్రీవమయ్యాయి. పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ... అధికార పార్టీ అభ్యర్థుల గెలుపులో మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,860 వార్డులకు 1,099, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 993కి 553, పూర్వ వరంగల్ జిల్లా పరిధిలో 1,260కి 509, సూర్యాపేట జిల్లాలో 608కి 304, కామారెడ్డి జిల్లాలో 713కి 207, పాత మహబూబ్‌నగర్ జిల్లాలో 988కి 203, నల్గొండ జిల్లాలో 506కి 138, వికారాబాద్‌లో 285కి 101 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
అన్ని వార్డులు ఏకగ్రీవమైనవి..
ఒకే సొసైటీలో అన్ని వార్డులు ఏకగ్రీవమైనవి అనేకం ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 43, నిజామాబాద్ జిల్లాలో 35, ఆదిలాబాద్‌లో 22, కరీంనగర్‌లో 14, వరంగల్‌లో 13, సూర్యాపేటలో 10, నల్గొండలో 3 సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవమయ్యాయి. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు సహకార కమిషనర్ వీరబ్రహ్మయ్య తెలిపారు.
మిగతా వార్డులకు ఈ నెల 15న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరుగుతాయి. మర్నాడు ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం బాన్సువాడలో 25కి 16, మంత్రి ఈటల నియోజకవర్గంలో 11కు 7 సంఘాల్లో అన్ని వార్డులూ ఏకగ్రీవమయ్యాయి.