No salaries for Teachers : రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని ఆదర్శ పాఠశాలలు, సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)కు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు అందలేదు. నెల ప్రారంభమై 17 రోజులు గడిచినా.. జీతాలు రాకపోవడంతో సుమారు 23 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 194 ఆదర్శ పాఠశాలల్లో దాదాపు 5 వేల మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 3 వేల మంది వరకు శాశ్వత ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి నెలా 1వ తేదీకి అందాల్సిన జీతాలు ఇప్పటి వరకూ మంజూరవలేదని ఆదర్శ పాఠశాలల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతన బిల్లును ఆర్థిక శాఖ ఆమోదించకపోవడంతోనే జాప్యమవుతున్నట్లు సమాచారం. వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియడంలేదని, దీంతో ప్రతి నెలా బ్యాంకులకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. ఎస్‌ఎస్‌ఏలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో దాదాపు 8 వేల మంది, సీఆర్‌పీలు 2,117, పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు 2,400, ఇతరులు కలిపి 10 వేల మంది వరకు ఉన్నారు.
వేతనాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు త్వరగా అందేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుండిగల్ యాదగిరి కోరారు. శాశ్వత ఉద్యోగులమైనా సకాలంలో జీతాలు అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆదర్శ పాఠశాలల ఉద్యోగ సంఘ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : పోలీసు శాఖలో ‘జంట’ వేదన... కుటుంబాలకు దూరమై