గురుకుల విద్యా సంస్థల్లో నియామక ప్రక్రియకు మార్గం సుగమమైంది. నూతన జోన్ల ప్రకారం సర్వీసు నిబంధనలు సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. డిగ్రీ లెక్చరర్, ప్రిన్సిపల్ పోస్టులు మల్టీ జోనల్ పరిధిలోకి రానున్నాయి. జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు జోనల్ పోస్టులుగా ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్, అంతకన్నా కిందిస్థాయి ఉద్యోగాలు జిల్లా కేడర్‌గా సవరించారు.
గురుకులాల్లో బోధన సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేకంగా గురుకుల నియామకాల బోర్డును సర్కారు ఏర్పాటు చేసింది. టీజీటీ, పీజీటీ, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల నియామక నోటిఫికేషన్లు జారీ చేసి.. ప్రక్రియ దాదాపు పూర్తి చేసింది. మరో నాలుగు వేల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రకటన జారీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి తెస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి.
న్యాయాభిప్రాయాలు తీసుకున్న తర్వాత... చివరకు ఐదు గురుకుల సొసైటీలు కొత్త విధానానికి అనుగుణంగా సర్వీసు నిబంధనలు సవరించి సర్కారుకు ప్రతిపాదనలు పంపించగా... ప్రభుత్వం వాటిని అంగీకరించింది. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవో రాగానే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు గురుకుల నియామక బోర్డు సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన నాలుగు వేల పోస్టులు సహా... గతంలో ఆమోదించిన వాటిలో సుమారు 500 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లో 3 వేల 689 పోస్టులు మంజూరయ్యాయి. ఇవన్నీ కలిపి గురుకులాల్లో మళ్లీ కొలువుల జాతర కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
- ఇదీ చూడండి : కళాశాల ప్రహరిగోడ కూలి 12 మంది దుర్మరణం