ఏపీలోని గుంటూరు జిల్లా పల్నాడులో తెదేపా నాయకుడు అంకులయ్య హత్య కేసును గ్రామీణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని.. ఇందులో రాజకీయ కోణం లేదని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
అంకులయ్య గతంలో జనశక్తి దళంలో పని చేశారు. ఆ సమయంలో ఆయన ముఖ్య అనుచరుడు కోటేశ్వరరావు. అయితే తన భూమిని అంకులయ్య తక్కువ ధరకే అమ్మేశారని కోటేశ్వరరావు పగ పెంచుకున్నారు. 1995 నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెంకటకోటయ్య, వెంకటేశ్వరరెడ్డి అనే మరో ఇద్దరితో కలిసి హత్యకు పథకం రచించాడు కోటేశ్వరరావు. వీరు ముగ్గరూ కలసి అంకులయ్య హత్యకు జనశక్తి నేత చిన్నశంకరరావుకు రూ.5 లక్షలకు సుపారీ ఇచ్చారు. జనవరి 3న అంకులయ్యను నమ్మకంగా దాచేపల్లి రప్పించి ఆహారంలో మత్తు కలిపి అనంతరం గోంతు కోసి హత్య చేశారు. హత్యలో జనశక్తి నేత చిన్న శంకరరావుతో పాటు... అంకమరావు, అద్దంకి రమేశ్ అనే మరో ఇద్దరు పాత నేరస్థులు పాల్గొన్నారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం- విశాల్ గున్నీ, గుంటూరు గ్రామీణ ఎస్పీ.
సంబంధిత కథనం: దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య