నాలుగేళ్ల క్రితం ఎంపిక అయినప్పటికీ.. ఇంకా శిక్షణలోనే ఉంచారని ప్రొబెషనరీ డిప్యూటీ తహసీల్దార్లు(పీడీటీ) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నవంబరులో జరిగిన గ్రూప్-2లో డీటీ పోస్టులకు 259 మంది ఎంపికయ్యారు. అప్పటి నుంచి వివిధ అడ్డంకులతో నిలిచిపోయిన వారి నియామక ప్రక్రియ 2019లో ప్రారంభమైంది. ఆ ఏడాది డిసెంబరులో పీడీటీ నియామక ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. 2020 ఫిబ్రవరి నుంచి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత జూన్‌లో 90 రోజుల క్షేత్రస్థాయి శిక్షణకు సొంత జిల్లాల నుంచి సుదూర జిల్లాలకు పంపారు.
స్పష్టత లేదు:
వరంగల్ జిల్లా వారిని నిజామాబాద్‌కు, ఖమ్మం వారిని ఆదిలాబాద్‌కు పంపించారు. ఆ శిక్షణ పూర్తయినా ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నెల 13వ తేదీకి వారి శిక్షణ కాలం ఏడాది పూర్తయింది. ఇప్పటికీ పోస్టింగ్ విషయంలో స్పష్టత లేదని ఆవేదన చెందుతున్నారు.
వదిలేసి ఎంచుకున్నారు..
2016 గ్రూప్స్‌కు ముందు ఇతర శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు వాటిని వదిలేసి రెవెన్యూ శాఖను ఎంచుకున్నారు. డీటీలుగా ఎంపికైన వారిలో కొందరు నిరుద్యోగులూ ఉన్నారు. వారిలో దాదాపు అందరికీ వివాహాలు అయ్యాయి. 40 మంది పీడీటీలకు.. జీవిత భాగస్వామి వేరే ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అనువైన ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలని పీడీటీలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: చలి తీవ్రత తగ్గుతోంది.. గాలిలో తేమ పెరుగుతోంది!