Grand Nursery Fair: గ్రాండ్ నర్సరీ మేళాకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో ఉద్యానశాఖ సహకారంతో... తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో... ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు ప్రదర్శన జరగనుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు లాంఛనంగా గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న నర్సరీలు, సంస్థలు, అంకుర కేంద్రాలు తరలిరానున్నాయి. దాదాపు 120 వరకు స్టాళ్లు కొలువు దీరనున్నాయి. పూలు, పండ్లు, కూరగాయలు విత్తనాలు, మొక్కలు, అంట్లు, సేంద్రీయ, జీవన ఎరువులు, మల్చింగ్, పనిముట్లు, ఇతర సామగ్రి విక్రయించడంతోపాటు మిద్దెతోటల నిర్వహణలో మెళకువలు నేర్పించనున్నారు.
టెర్రస్ గార్డెనింగ్‌లో భాగంగా పర్యావరణహిత అత్యాధునిక హైడ్రోపొనిక్ సాంకేతిక పరిజ్ఞానం, తేనెటీగల పెంపకంపై మహిళలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
కరోనా వెంటాడుతున్న వేళ... పౌష్టికాహరంపై నగరవాసులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా సొంత జాగాలు, డాబాలు, బాల్కనీలు, టెర్రస్‌పైన కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మిద్దెతోటల నిర్వహణలో భాగస్వామ్యులైన 25 వేల మంది టెర్రస్ నిర్వాహకులకు ఉచిత ప్రవేశం కల్పించారు. వివిధ ఉత్పత్తుల కొనుగోలుపైనా రాయితీ ఇవ్వనున్నారు. వ్యవసాయం, ఉద్యాన నిర్వహణపై ఆసక్తి పెంచేందుకు విద్యార్థులకు 50 శాతం రాయితీతో ప్రవేశానికి అవకాశం కల్పించారు.
ఇదీ చూడండి: