రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, పోలీసులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు పట్టభద్రులు చేరుకుంటున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బంజారాహిల్స్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ విజయా రెడ్డి, తార్నాకలోని పోలింగ్ కేంద్రంలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాంపల్లిలో సీపీ సజ్జనార్ దంపతులు ఓటు వేశారు.
కేపీహెచ్‌బీ కాలనీలో ఎమ్మెల్సీ నవీన్ రావు, కేపీహెచ్‌బీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా ఓటింగ్‌లో పాల్గొనాలని నవీన్ రావు కోరారు.
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి, కాప్రా సర్కిల్లోని కుషాయిగూడ, ఏఎస్ రావునగర్, కీసర, మీర్పేట్ హౌసింగ్‌లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. చందా నగర్, శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో 24,511 మంది పట్టభద్రులు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉపకమిషనర్లు వెంకన్న, సుధాంశ్ నందగిరిలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండల కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలో 4,290, మంచాలలో 2,368, యాచారంలో 2,219 పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెరాస పార్టీకి చెందిన ఏజెంట్.. గులాబీ రంగు టీ షర్ట్‌తో రావడం వల్ల అడ్డుకున్న పోలీసులు అతణ్ని తిరిగి పంపించారు. టీషర్ట్‌తో వెళ్తే తప్పేంటి అని తెరాస కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.