పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ప్రచారం పరిసమాప్తమైంది. పోలింగ్ కోసం అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి. పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సమీక్షించారు.
రాష్ట్రంలోని రెండు స్థానాలకు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు, ఇతరులు ఎన్నికలను పూర్తి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మంత్రులు, ఆయా పార్టీల అధ్యక్షులు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. పార్టీలు, అభ్యర్థుల గెలుపు కోసం స్వరశక్తులూ ఒడ్డారు. ఊరూ, వాడా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేశారు.
ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రచారం ఉద్ధృతమైంది. దాదాపుగా నెల రోజుల నుంచి ప్రచారం హోరెత్తింది. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ప్రచారం ముగిసింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. బుధవారం ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.