Govt job notification delayed: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ప్రభుత్వం 6 నుంచి 10 శాతానికి పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసే ప్రక్రియ ఆలస్యం కానుంది. జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్ల ఫలాలు అందించేందుకు ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనల్లో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. భవిష్యత్తులో వెలువడే నోటిఫికేషన్లలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల మేరకు పోస్టుల సంఖ్య పెరగనుంది. ఇప్పటివరకు నోటిఫికేషన్లు జారీచేయని ప్రతిపాదనలను సవరించి.. పెరిగిన రిజర్వేషన్ల మేరకు మార్పులు చేసి పంపించాలని ఆయా విభాగాలకు నియామక సంస్థలు లేఖలు రాస్తున్నాయి. 10 శాతం రిజర్వేషన్ల అమలుకు 100 పాయింట్ల రోస్టర్‌లో 10 పాయింట్లు రిజర్వు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను సాధారణ పరిపాలన శాఖ మొదలుపెట్టింది. రోస్టర్‌కు సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన తరువాత సవరణ ప్రతిపాదనలపై కసరత్తు మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రతిపాదనలకు సవరణలు.. ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 52 వేల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చింది. 18 వేల పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మిగతా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలుగా సంబంధిత విభాగాలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి.
గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం అనుమతులు జారీ చేయకున్నా.. ఒక్కో జిల్లాలో 74 విభాగాల చొప్పున 33 జిల్లాల అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో 9 వేల ఉద్యోగాలకు సొసైటీలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. గ్రూప్-2, 3 పోస్టులకు కొన్ని విభాగాలు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు అందించాయి. గ్రూప్ ఉద్యోగాలు మినహా ఇతర ఉద్యోగాల ప్రతిపాదనలు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలుగా కమిషన్, నియామక సంస్థల పరిశీలనలో ఉన్నాయి. తాజాగా గిరిజన రిజర్వేషన్ల పెరగడంతో ఆయా ప్రతిపాదనలన్నింటినీ సవరించాల్సి ఉంటుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు మరికొంత ఆలస్యం కానున్నాయి. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల నేపథ్యంలో రాష్ట్రంలో రోస్టర్ పాయింట్ 1 నుంచి నియామకాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలను పూర్తిగా సవరించాలా? స్వల్ప మార్పులు చేస్తే సరిపోతుందా? అన్న అంశంపై రోస్టర్ పాయింట్ల ఖరారు తరువాత స్పష్టత రానుంది.
టీఆర్‌టీలో 5 మార్పులు.. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి చేపట్టే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(టీఆర్‌టీ) ప్రకటనలో ప్రధానంగా అయిదు మార్పులు చోటుచేసుకున్నాయి. గత నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, న్యాయస్థానాల ఆదేశాలు తదితర కారణాలతో వచ్చే ఈ మార్పులు తప్పవని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు మార్పులు ఉంటాయని భావిస్తుండగా.. తాజాగా గిరిజన రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో మొత్తం అయిదు మార్పులు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.
గతంలో స్థానిక కోటా 80 శాతం, స్థానికేతర కోటా 20 శాతం ఉండేది. 2017 జులైలో 8,700 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లోనూ 20 శాతం స్థానికేతర కోటా కింద ఇతర జిల్లాలవారు పోటీపడేవారు. ఆ తర్వాత రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు వెలువడటంతో ఈ కోటా 5 శాతానికి తగ్గింది. గతంలో 4-10 తరగతుల్లో నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణించేవారు. మారిన ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే జిల్లా స్థానికతకు ప్రామాణికం కానుంది.
గతంలో భద్రాచలం, ములుగు తదితర నోటిఫైడ్ గిరిజన ప్రాంతాల్లో ఖాళీలన్నింటినీ ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేసేవారు. రిజర్వేషన్ 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఏడాది క్రితం తీర్పు వెలువరించింది. దాంతో ఇకనుంచి చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో ఏజెన్సీ, మైదాన ప్రాంతాలని వేర్వేరుగా ఉండవు. అంతా మైదాన ప్రాంతమే.
మహిళల కోటా 50 శాతానికి మించకుండా: ఉపాధ్యాయ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ ఖాళీలకు అధిక సంఖ్యలో మహిళలు పోటీపడుతున్నారు. కరీంనగర్ లాంటి జిల్లాల్లో 2012 నోటిఫికేషన్‌లో 67 శాతం మంది మహిళలు ఎంపికయ్యారు. ఇప్పటివరకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు సందర్భంగా వర్టికల్ విధానాన్ని అవలంబిస్తుండగా.. దాని బదులు హారిజాంటల్(సమాంతరంగా) విధానాన్ని అమలు చేయాలని హైకోర్టు గత నెలలో గ్రూపు-1 కేసులో తీర్పునిచ్చింది. అది అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుందని, ఉపాధ్యాయ కొలువుల్లోనూ మహిళలకు 50 శాతానికి మించి కొలువులు రావని విద్యాశాఖ అధికారి ఒకరు స్పష్టంచేశారు. ఎస్టీ రిజర్వేషన్ అమలు..రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో వచ్చింది. ఉపాధ్యాయ నియామకాలపైనా దీని ప్రభావం పడనుంది. రోస్టర్ పాయింట్లు మారిపోనున్నాయి.
ఇవీ చదవండి: