వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పన, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నా సుస్థిర వ్యవసాయ పద్ధతులు అవలంభించడం కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత సర్ రిచర్డ్ జాన్ రాబర్ట్స్ గౌరవార్థం... “సుస్థిర వ్యవసాయం” అన్న అంశంపై చెన్నై ఇనిస్టిట్యూషన్ ఆఫ్ గ్రీన్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్‌లైన్ ఉపన్యాస కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. భావితరాలకు మంచి పర్యావరణం అందించాలంటే వనరుల సమతుల వినియోగంతో పాటు, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులు పాటించాల్సిన ఆవశ్యకత ఉందని గవర్నర్ తెలిపారు.
మన సంప్రదాయాలే ప్రకృతిని పరిరక్షిస్తున్నాయి
నేల సారం సంరక్షిస్తూ నీటి సద్వినియోగం ద్వారా వనరుల విధ్వంసం జరగకుండా ప్రకృతి సిద్ధమైన వ్యవసాయంతో ఆహార భద్రత సాధించడం వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు, ప్రభుత్వాల ముందున్న అతి పెద్ద సవాల్ అని గవర్నర్ విశ్లేషించారు. తరతరాలుగా భారతీయులు నదులు, చెట్లు, ప్రకృతిని కాపాడుతూ పూజిస్తున్నారని... ఈ ఆధ్యాత్మిక నమ్మకాలతో ప్రకృతి పరిరక్షణ అద్భుతంగా జరిగిందని గుర్తు చేశారు. టెక్నాలజీ ఆవిష్కరణలు, నవకల్పనలు ప్రకృతి పరిరక్షణ, వనరుల సమతుల వినియోగం, భావితరాలకు ఆహార భద్రత కల్పించేవిగా ఉండాలని తమిళిసై పిలుపునిచ్చారు.
ఆహార భద్రత కోసం అధిక ఉత్పత్తి కీలకం
కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఈ-మార్కెటింగ్‌తో పాటు ఆత్మ నిర్భర్ భారత్ ప్రణాళికలో భాగంగా వ్యవసాయానికి కేంద్రం లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం వ్యవసాయం ఎంత కీలకమో తెలియజేస్తుందని చెప్పారు. సాగులో టెక్నాలజీ వినియోగం సుస్థిర అభివృద్ధికి దోహదపడేదిగా ఉండాలని నోబెల్ బహుమతి గ్రహీత సర్ రిచర్డ్ జాన్ రాబర్ట్స్ అన్నారు. విత్తనాల నాణ్యత, భూసార పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం, ఆరోగ్యకరమైన వ్యవసాయ పంటల సాగు విధానాలు, ఆహార భద్రత కోసం అధిక ఉత్పత్తి అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆర్‌ఎం వసగం, ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టీ ఏపీజేఎంజే షేక్ దావూద్, ఐజెన్ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.