మహిళా సాధికారతలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మహిళలు తమ కలలను నిజం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో రెండు వసతిగృహాలు, వర్మి కంపోస్టింగ్ యూనిట్‌ను గవర్నర్ వర్చువల్‌గా ప్రారంభించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అందివస్తున్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని సత్తాచాటాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, యువతలో డిప్రెషన్ కేసులు పెరుగుతుండడంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అపజయాలకు కుంగిపోకుండా ఉన్నత లక్ష్యాల దిశగా పట్టుదలతో కష్టపడాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. విద్యార్థిదశ జీవితంలో అత్యంత విలువైనదని, జ్ఞానాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులను గౌరవిస్తూ లక్ష్యాలను చేరుకొని.. తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని చెప్పారు. ఉన్నతవిద్యలో నాణ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు