యువత, విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి, నూతన ఆవిష్కరణలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై, డీఆర్‌డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో 80 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. 2018 నుంచి 2020 జూన్ వరకు ఉత్తీర్ణులైన విద్యార్థలకు పట్టాలిచ్చారు.
సృజనాత్మకంగా ఆలోచిస్తేనే..
"ఒకే విషయాన్ని రోజూ సాధన చేయటం వల్ల లాభం లేదు. సరికొత్తగా ఆలోచించాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుని... పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీరు రోజు కష్టపడే కంటే ఒక గంట ఎక్కువ కేటాయిస్తే.. మీ చదువుల్లో రాణించటం, మీమీ గమ్యాలను చేరటం మరింత సులువవుతుంది. ఈరోజు ఆలోచించేదాని కంటే కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెడితే.. మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది. సవాళ్లను స్వీకరించాలి. వాటిని ఎదుర్కుంటూనే ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరగలుగుతాం. ఇతరులను అనుకరించటం మానేయాలి. మీరే కొత్తగా ప్రారంభించాలి. ఓ సరికొత్త ఆవిష్కరణకు మీరే ప్రారంభికులు కావాలి. అందుకోసం సృజనాత్మకంగా ఆలోచించాలి. చుట్టూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని అనుకున్నది సాధించాలి." -తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ప్రపంచంలోనే భారత్ ఫస్ట్..
గత ఆరేడేళ్లలో భారత్ అనేక రంగాల్లో అభిృవృద్ధి చెందిందని డీఆర్‌డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యాంటీ శాటిలైట్ మెషీన్‌ను కేవలం రెండేళ్లలోనే తయారు చేయగలిగినట్లు ఆయన తెలిపారు. స్వపరిజ్ఞానంతో అనేక క్షిపణులు రూపొందించి ప్రపంచంలో తొలి ఆరు స్థానాల్లో నిలిచిందన్నారు. డ్రోన్ టెక్నాలజీలో ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉందనడంతో ఎలాంటి అనుమానం లేదని సతీష్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పటికీ కొంత వెనకబడి ఉన్నామని.. ముఖ్యంగా సొంతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని ఆత్మనిర్భర భారత్ పిలుపు మేరకు.. సొంతగా డిజైన్ చేసి, తయారు చేసి, ఎగుమతి చేయగలగాలన్నారు.
ప్రస్తుతం దిగుమతుల్లో అగ్రాభాగాన ఉన్న రక్షణ శాఖ.. ఎగుమతుల్లో పైచేయిగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో స్టార్టప్ ల సంస్కృతి దూసుకెళ్తోందని... 50వేల స్టార్టప్‌లు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌లోని పలు స్టార్టప్‌లు రక్షణ శాఖకు అవసరమైనవి అందిస్తున్నాయని అభినందించారు. దేశ రక్షణ శాఖ వ్యవస్థకు అవసరైన సాంకేతిక ఐడియాలు ఇచ్చే వారికి సాంకేతిక అభివృద్ధి నిధి కింద కోటి నుంచి 10 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని సతీష్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాల్లో లోతైన పరిశోధలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాలని అభిలషించారు. ఉస్మానియా యూనివర్సిటీలో డీఆర్డీఓ ప్రాజెక్టులు మరిన్ని కొనసాగిస్తామని సతీష్‌రెడ్డి తెలిపారు.
"డ్రోన్ సాంకేతికతలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. యాంటీ డ్రోన్ టెక్నాలజీని మొదట మనమే కనిపెట్టాం. ఎంతో చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. దేశానికి గొప్ప నాయకులను, నిపుణులను ఉస్మానియా విశ్వవిద్యాలయం అందించింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు, నాయకులు, క్రీడాకారులు ఉస్మానియా విద్యార్థులే." -సతీశ్‌రెడ్డి, డీఆర్‌డీవో ఛైర్మన్
ఇదీ చూడండి: