కొవిడ్‌కు మన దేశం నుంచి త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని... అది కూడా హైదరాబాద్ నుంచే రానుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులతో దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ప్రపంచాన్ని ముందుకు నడిపే అవకాశాలు దేశంలో పుష్కలంగా ఉన్నాయని తమిళిసై తెలిపారు. మెజార్టీగా ఉన్న యువతే దేశాన్ని అభివృద్ధి దిశగా నడుపుతారన్నారు. తాము ఎంచుకున్న రంగంలో యువత గొప్పగా రాణించి దేశానికి సేవ చేయాలన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మనిర్బర్ భారత్ ద్వారా దేశం ఎన్నో రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోం కార్యక్రమం నిర్వహించట్లేదని మొదట బాదపడ్డానని, అయితే ఇంతమంది ప్రముఖులతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి చెందిన మొదటి వ్యోమగామి రాకేశ్ శర్మ, భారత్ బయోటెక్ సంయుక్త ఎండీ సుచిత్ర యెల్ల, హెటిరో డ్రగ్స్ పార్థసారధి రెడ్డి, కార్గిల్ యుద్ధంలో అమరుడైన మేజర్ పద్మపాణి ఆచార్య భార్య చారులత, గాల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణల్లో చనిపోయిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు, మిలటరీ అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషితో మాట్లాడిన సమయంలో గవర్నర్ ఉద్వేగానికి లోనయ్యారు. సంతోష్, సైన్యం త్యాగం పట్ల రాష్ట్ర, దేశ ప్రజలు గర్విస్తున్నారని తెలిపారు. తాను, రాష్ట్ర ప్రజానీకం వారి వెంట ఉన్నారని భరోసా ఇచ్చారు.