ఉపాధ్యాయులు దేశాన్ని ముందుకు నడిపే నాయకులను తీర్చిదిద్దే జాతినిర్మాతలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. ఉపాధ్యాయుల నిస్వార్థసేవ, చిత్తశుద్ధితో విద్యార్థుల్లోని శక్తిసామర్థ్యాలను వెలికితీస్తారని గవర్నర్ పేర్కొన్నారు. దేశ, వ్యక్తుల భవిష్యత్ తరగతి గదుల్లో తయారవుతుందని అన్నారు. జాతీయవిద్యావిధానంపై జరిగిన వెబినార్‌లో గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ నుంచి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో పాఠాశాల విద్య ప్రాధాన్యాంశంగా వెబినార్ నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. గురువుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని.. వాళ్లందరికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. నిరుపేద, మారుమూల ప్రాంతాల విద్యార్థులు సైతం ఉపాధ్యాయుల సహకారంతో అద్భుతాలు సృష్టించారని ప్రశంసించారు.
పౌష్టికాహారంతో కూడిన ప్రాథమిక విద్య ఆరోగ్యకరమైన దేశాన్ని తీర్చిదిద్దుతుందన్న గవర్నర్.. కొత్త విద్యావిధానం అందుకు మంచి వేదికని పేర్కొన్నారు. దేశ విద్యావ్యవస్థను తీర్చిదిద్దే సత్తా నూతన విధానానికి ఉందని.. భారతదేశాన్ని సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.