సర్కారు శాఖలన్నీ ఇకపై సరకు రవాణా వ్యవహారాలను.. ఆర్టీసీ కార్గో ద్వారానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ఉత్తర్వులు వారంలోగా జారీ అయ్యే అవకాశం ఉంది.
కేసీఆర్ నిర్ణయం కోసం..
త్వరలోనే కార్గో సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. దశలవారీగా 822 బస్సుల ద్వారా కార్యకలాపాలు నిర్వహించనుంది. తొలిదశలో 52 బస్సులను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అనుమతి లభిస్తే సోమవారం నుంచే కార్గో సేవలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలుత ఈ శాఖల్లోనే..
సేవలు అందుబాటులోకి వస్తే.. వ్యవసాయశాఖ- ఎరువులు, విత్తనాల రవాణా చేసేందుకు అవకాశం ఉంటుంది. పౌరసరఫరాల శాఖ- గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం చేరవేతకు అవకాశం ఉందని గుర్తించారు. ముందుగా ఈ రెండు శాఖల్లో కార్గో సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు.
విద్యాశాఖ, అబ్కారీ శాఖల్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రవాణా సదుపాయం అవసరమైన అన్ని ప్రభుత్వశాఖలపై అధ్యయన బాధ్యతలను మార్కెటింగ్ సిబ్బందికి అప్పగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రైవేటు రంగంలోనూ ఆటోమొబైల్, వస్త్రరంగం, పైపుల తయారీ కంపెనీల్లోనూ అవకాశాలు మెండుగా ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతానికి ఆసక్తి చూపే సంస్థలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీచూడండి: ఆర్టీసీ కార్గో సేవలకు ముహూర్తం ఖరారు..