ఆంధ్రప్రదేశ్‌లో సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 41 (1) ప్రకారం.. రాజధాని వ్యూహ ప్రణాళిక, బృహత్ ప్రణాళిక, మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళిక, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల్లో మార్పులు చేయాలంటే రాజధాని పరిధిలోని స్థానిక సంస్థల నుంచి ప్రతిపాదన రావాలి. అది సముచితం, అవసరం అనుకుంటే దానిపై సీఆర్‌డీఏ అథారిటీ నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ఇందుకు సవరణలు చేసింది.
స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలక మండళ్లు లేనప్పుడు.. దానికి పర్సన్ ఇన్‌ఛార్జిగా ఉన్న అధికారి నుంచి ప్రతిపాదన వచ్చినా ప్లాన్లలో సీఆర్‌డీఏ అథారిటీ సవరణ చేసేయొచ్చు అని మార్పు చేశారు. అలాగే స్థానిక సంస్థల నుంచి ప్రతిపాదన రాకపోయినా సీఆర్‌డీఏ అథారిటీ సొంతంగా నిర్ణయం తీసేసుకోవచ్చంటూ సవరించారు. భూమి యజమాని ఎవరి నుంచైనా విజ్ఞప్తి వచ్చినా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
ఇప్పుడు చట్టాన్ని సవరించడం ద్వారా.. ప్రభుత్వం తన ఇష్టానికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ సహా వివిధ ప్లాన్లలో మార్పులు చేసేందుకు వెసులుబాటు లభిస్తుంది. రాజధాని గ్రామాల్లో పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. అక్కడ ఎన్నికైన పాలకమండళ్లు లేవు. కాబట్టి పర్సన్ ఇన్‌ఛార్జులతో ఒక ప్రతిపాదన తెప్పించుకుని ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేయొచ్చు.
ప్రభుత్వం కావాలనుకుంటే తనంత తానుగా కూడా నిర్ణయాలు తీసుకునేలా చట్టాన్ని సవరించడంవల్ల మాస్టర్‌ప్లాన్‌లో ఇష్టానుసారం మార్పులు చేసేయొచ్చు. మౌలిక వసతుల ప్రణాళికనూ కుదించవచ్చు.
ప్రజాభిప్రాయం నామమాత్రమే: సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని అభివృద్ధి ప్రణాళికల్లో ఏమైనా మార్పులు చేసే ముందు.. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. పదిహేను రోజుల గడువిచ్చి వారి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించాలి. కానీ ప్లాన్లలో మార్పులు చేయాలని ప్రభుత్వం తనంతట తాను నిర్ణయం తీసుకున్నప్పుడు.. కేవలం ప్రజల నుంచే కాకుండా.. స్థానిక సంస్థల నుంచి అభిప్రాయం తీసుకోవాలని సవరించారు.
స్థానిక సంస్థల పాలక మండళ్లు లేకుంటే పర్సన్ ఇంఛార్జులు దాదాపుగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు. కాబట్టి వారు చెప్పిందే చెల్లుబాటవుతుంది. ప్రజాభిప్రాయం నామమాత్రమే అవుతుంది. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని మూడు పంచాయతీల్ని కలిపి.. మొత్తం 22 పంచాయతీలతో అమరావతిని మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించగా ప్రజలంతా మున్సిపాలిటీ ప్రతిపాదనను ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఇప్పుడు వారి అభిప్రాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంది. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 2(22)లో భూసమీకరణ పథకానికి నిర్వచనం చెప్పారు. రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములు సమీకరించి, దానిలో పార్కులు వంటి ప్రజావసరాలకు, ఆర్థికంగా బలహీనవర్గాలకు సామాజిక గృహ నిర్మాణానికి, పాఠశాలలు.. ఆసుపత్రులు వంటి సామాజిక వసతులకు, రోడ్లు వంటి మౌలిక వసతులకు, వాటన్నిటి అభివృద్ధికి కావలసిన నిధుల సమీకరణకు అవసరమైన భూమిని తీసివేసి, మిగతా భూమిలో మౌలిక వసతులు అభివృద్ధి చేసి రైతులకు స్థలాలు అప్పగించడం అని పేర్కొన్నారు.
ఈ నిర్వచనంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సామాజిక గృహ నిర్మాణం అని ఉన్నచోట.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఇళ్ల నిర్మాణానికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అని సవరణ చేశారు. ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసేసి, ఎక్కడ కావాలంటే అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహ నిర్మాణ పథకాల కింద ఎంత మందికి కావాలంటే అంత మందికి ఇళ్ల పట్టాలిచ్చే వెసులుబాటు లభిస్తుంది.
ఎవరికైనా రాజధానిలో ఇళ్ల పట్టాలు : సీఆర్‌డీఏ చట్టంలో ఇప్పుడు కొత్తగా 53(1) అన్న సెక్షన్ చేర్చారు. ఈ సెక్షన ప్రకారం..కేవలం రాజధాని గ్రామాలు, సీఆర్‌డీఏ పరిధిలోని వారికి మాత్రమే రాజధానిలో ఇళ్ల స్థలాల్ని పరిమితం చేయకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని వారైనా రాజధానిలో ఇళ్ల పట్టాలు పొందవచ్చు.
విజయవాడతో పాటు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, మంగళగిరి వంటి ప్రాంతాలకు చెందిన సుమారు 54 వేల మందికి రాజధానిలో 12 వందల 51 ఎకరాల్ని పట్టాలుగా ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వం ప్రయత్నించింది. మాస్టర్‌ప్లాన్‌ను ఇష్టం వచ్చినట్టు మార్చడం కుదరదన్న హైకోర్టు.. ఇళ్లస్థలాల పట్టాలిచ్చే జీవోను కొట్టేసింది. సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించిన నేపథ్యంలో ప్రభుత్వానికి మళ్లీ ఆ ప్రయత్నం చేసేందుకు వెసులుబాటు లభించింది.
ఇవీ చదవండి: 'అధికారంలోకి రాగానే వారి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేస్తాం'
నదిలో బోల్తా పడ్డ స్కూల్ విద్యార్థుల బోటు.. ఒక్కసారిగా 25 మంది పిల్లలు!